Thursday, September 19, 2024

AP: నేటి సాయంత్రానికి సాధారణ స్థితి నెలకొనాలి : సీఎం చంద్రబాబు

విజయవాడ: ఉత్తరాంధ్రలో భారీ వర్షాల దృష్ట్యా ఆ ప్రాంత మంత్రులకు సీఎం చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. క్షేత్రస్థాయిలో తిరిగి సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని ఆదేశించారు. విజయవాడ కలెక్టరేట్‌లో సోమవారం అర్ధరాత్రి వరకూ సీఎం సమీక్ష నిర్వహించారు. విజయవాడ నగరంలో వరద సహాయక చర్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరదలపై యుద్ధం తుదిదశకు వచ్చిందని.. నేటి సాయంత్రంలోపు నగరంలో సాధారణ స్థితి నెలకొనాలని ఆదేశించారు. అనంతరం ఇతర పాలనా వ్యవహారాలపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.

ముంపునకు గురైన 32 వార్డుల్లో 26 చోట్ల సాధారణ స్థితి నెలకొందని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. 3 షిఫ్టుల్లో పురపాలక సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేస్తున్నారన్నారు. 95 శాతం విద్యుత్ పునరుద్ధరణ జరిగిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. ఇంకా నీరు ఉన్న 6 డివిజన్లలో ఈ సాయంత్రం సాధారణ స్థితి వస్తే పూర్తి స్థాయిలో విద్యుత్ పునరుద్దరిస్తామని పేర్కొన్నారు.

ఆప్కో, ఇతర సంస్థల నుంచి దుస్తులు తెప్పించి సర్వం కోల్పోయిన బాధితులకు పంచే ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. 2.75లక్షల మంది ముంపునకు గురైనందున వారి కష్టాలు తీర్చాలన్నారు. అర్బన్ కంపెనీ సాయంతో పాడైన అన్ని వస్తువులు బాగు చేయించటం, యాప్ వినియోగంపై ప్రజల్లో చైతన్యం పెంచటంపై మంత్రులకు చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. సహాయక చర్యల పర్యవేక్షణకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement