పెద్ద ఎత్తున ర్యాలీతో తరలివచ్చిన లీడర్లు
ఏపీలో మాగుంటదే తొలి నామినేషన్
ఆ తర్వాత విజయవాడలో సుజనా చౌదరీ
లోకేశ్ తరపున మంగళగిరిలో దాఖలు చేసిన అన్నివర్గాల నేతలు
నామినేషన్ల ప్రారంభంతో మొదలైన సందడి
(ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) – ఏపీలో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో తొలి బోణి జరిగింది. మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తరపున కూటమి పార్టీల సమన్వయ కర్తలు , ఒంగోలులో లోక్సభ అభ్యర్థిమాగుంటశ్రీనివాసులరెడ్డి, విజయవాడ పశ్చిమలో సుజనా చౌదరి నామినేషన్ పత్రాలుదాఖలుచేశారు.
మంగళగిరిలో లోకేష్ తరుపున ..
కుప్పం తరహాల టీడీపీ నేత లోకేష్ తరపున మంగళగిరిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు నామినేషన్దాఖలుచేశారు. మంగళగిరి టీడీపీ సమన్వయకర్త నందం అబద్దయ్య, జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు, బీజేపీ సమన్వయకర్త పంచుమర్తి ప్రసాద్ ఆధ్వర్యంలో 2సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మంగళగిరి శ్రీ సీతారామ కోవెలలో యువనేత నామినేషన్ పత్రాలతో కూటమినేతలు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయం వెలుపల సర్వమత ప్రార్థనలు జరిపించారు. ప్రార్థనల అనంతరం మంగళగిరి సీతారామ కోవెల నుంచి మంగళగిరి మిద్దె సెంటర్, వైష్ణవి కల్యాణమండపం, పాత బస్టాండ్ సెంటర్ మీదుగా ఈ ర్యాలీ మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి ర్యాలీ చేరుకోగా.. లోకేష్తరపున కూటమి సమన్వయ కర్తలు నామినేషన్పత్రాలనుదాఖలుచేశారు.
ఒంగోలులో శ్రీనివాసులు రెడ్డి
ఒంగోలు లోక్ సభ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గురువారం ఒక సెట్టు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. మరో సెట్ను మాగుంట గీతాలత దాఖలు చేశారు. మూడో సెట్నుబూచిఏడుకొండలు దాఖలు చేశారు. ప్రకాశం భవనంలో రిటర్నింగ్ అధికారి .ఏ. ఎస్.దినేష్ కుమార్ ఈ మూడు నామినేషన్ పత్రాలను స్వీకరించారు. దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పి.కొండారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
విజయవాడ పశ్చిమలో సుజనా చౌదరి
పశ్చిమ నియోజక వర్గ ప్రజలు తనను ఎంతగానో ఆదరిస్తున్నారని ఇక్కడి ప్రజల ఆశీస్సుల తో భారీ మెజారిటీతో గెలుస్తానని పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీలు బలపరిచిన బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) ధీమా వ్యక్తం చేశారు. తరలివచ్చిన వేలాదిమంది కార్యకర్తలు, తోడుగా కూటమి నాయకుల కోలాహలం మధ్య సుజనా చౌదరి ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసే ముందు విజయవాడ చిట్టి నగర్ కొత్త అమ్మవారి ఆలయంలో సుజనా ప్రత్యేక పూజల చేశారు. ప్రజలు తనను ఆదరిస్తున్న తీరుకు సంతోషంగా ఉందన్నారు. ప్రచారంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను కళ్ళారా చూశానని అన్నారు. పశ్చిమ నియోజవర్గ న్నీ అభివృద్ధి పరచేందుకు రాజ్యాంగ బద్ధమైన నాయకుడు అవసరం ఉందని ఆ బాధ్యతను తాను తీసుకుంటానని సుజనా స్పష్టం చేశారు.
విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ , మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ , టీడీపీ నాయకులు బుద్ధా వెంకన్న , జనాబ్ జలీల్ ఖాన్ , జనాబ్ నాగుల్ మీరా , జనాబ్ ఎంఎస్ బేగ్ , బీజేపీ జిల్లా అధక్షులు అడ్డూరి శ్రీరామ్ , పెద్ద ఎత్తున ప్రజలు, మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నామినేషన్ల జాతర
ఎన్నికల ప్రకియలో తొలి రోజు వైసీపీ అభ్యర్థులు ధూంధాంగా నామినేషన్లు దాఖలు చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేటంలో వైసీపీ అభ్యర్థి అకేపాటి అమరనాథరెడ్డి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ సమర్పించారు. సూళ్లూరుపేట రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, వైసీపీ నాయకుడు వేనాటి రామచంద్రారెడ్డి, కలికి మాధవరెడ్డి పాల్గొన్నారు.
కోస్తాలో కోలాహలం..
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జి పూనూరు గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కొవ్వూరులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు నామినేషన్ దాఖలు చేశారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని ఎలమంచిలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ నామినేషన్ వేశారు.
సీమలో అట్టహాసంగా..
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ అభ్యర్థి బుట్ట రేణుక నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య, వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ రుద్ర గౌడ్ పాల్గొన్నారు. కడప జిల్లా మెదుకూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పాల్గొన్నారు.
తిరుపతి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా భూమన అభినయ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, స్టాండింగ్ కమిటీ సభ్యుడు వెంకటేష్ పాల్గొన్నారు. చిత్తూరులో వైసీపీ అభ్యర్థి ఎం సీ విజయానందరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ రెడ్డప్ప, చంద్రగిరి అసెంబ్లీ అభ్యర్థి మోహిత్ రెడ్డి పాల్గొన్నారు.
కావలి ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కోవూరు టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేశారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి దాఖలైంది. టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ ) నామినేషన్‌ను.. ఆయన సతీమణి హేమలత దాఖలు చేశారు. పయ్యావుల అనుచరులు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లిన హేమలత.. స్థానికంగా ఉన్న తహసిల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అందజేశారు.