Thursday, November 21, 2024

అంతర్జాతీయ అవార్డుకు ఆర్బీకేల ఎంపిక.. దేశానికే ఆదర్శంగా రైతు భరోసా కేంద్రాలు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో రైతు సంక్షేమానికై అమలు చేస్తున్న రైతు భరోసా కేంద్రాలు గత రెండేళ్ళగా సత్ఫలితాలను ఇస్తున్నాయనేందుకు నిదర్శనంగా ఐక్యరాజ్య సమితిలో అనుబంధ విభాగమైన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌(ఎఫ్‌ఏఓ) ప్రతిష్టాత్మక ఛాంపియన్‌ అవార్డుకు ఎంపిక కావడం జరిగిందని వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి వెల్లడించారు బుధవారం ఏపీ సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కాకాణి మాట్లాడుతూ, రైతు భరోసా కేంద్రాలు నేడు రాష్ట్రాన్రికి, దేశానికే గాక ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్‌ అమలుచేస్తున్నఅనేక సంక్షేమ కార్యక్రమాల పట్ల అనేక రాష్ట్రాల్రు దేశం ఏపీ వైపు చూస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగం ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌ ఆరు అవార్డులు ప్రకటిస్తే వాటిలో ఆంధ్రప్రదేశ్‌ నుండి రైతు భరోసా కేంద్రాలు నామినేట్‌ కావడం ఆనందదాయకని పేర్కొన్నారు. ఎఫ్‌ఏఓ ప్రకటించిన ఆరు అవార్డుల్లో ఎపి నుండి ఆర్బీకెలు, ఒడిస్సా నుండి వాటర్‌ షెడ్డు పధకం కూడా అవార్డుకు నామినేట్‌ కావడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రంలో మొత్తం 10 వేల 778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కాగా వాటిలో 5 వేల 945 ప్రభుత్వ భవనాల్లో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. నేడు రైతు భరోసా కేంద్రాలు రైతులకు అన్ని విధాలా ఎంతో ఉపయోగపడుతున్నాయని ముఖ్యంగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటివి వీటి ద్వారానే రైతులకు పంపిణీ జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో 12 లక్షల 57 వేల 830 మంది రైతులకు 4 లక్షల 75 వేల 166 మెట్రిక్‌ టన్నుల ఎరువులు, 29 లక్షల 30 వేల 184 మంది రైతులకు 15 లక్షల 96 వేల క్వింటాళ్ళ విత్తనాలు పంపిణీ చేశామని.. అంతేగాక లక్షా 50 వేల 822 మంది రైతులకు లక్షా 36 వేల 443 లీటర్ల పురుగు మందులను పంపిణీ చేసినట్టు చెప్పారు. 2021-22 కాలంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా 10 లక్షల 3 వేల 281 మంది రైతులకు 3 లక్షల 68 వేల 204 మెట్రిక్‌ టన్నుల ఎరువులు, 15 లక్షల 25 వేల 356 మంది రైతులకు 8 లక్షల 96 వేల క్వింటాళ్ళ విత్తనాలు, లక్షా 49 వేల 975 మంది రైతులకు లక్షా 35 వేల 546 లీటర్ల పురుగు మందులను పంపిణీ చేసినట్టు మంత్రి గోవర్ధన రెడ్డి వివరించారు. రైతుల నుండి రైతు భరోసా కేంద్రాల ద్వారా పెద్దఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతోందని ఇప్పటికే 40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. గతంలో ఎన్నడూలేని రీతిలో వ్యవసాయ అభివృద్ధి రైతు సంక్షేమానికి వినూత్న రీతిలో అనేక పధకాలు,కార్యక్రమాలను అమలు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం గాని వ్యవసాయం, రైతుల గురించి మాట్లాడే హక్కు గాని ప్రతి పక్షాలకు లేదని మంత్రి కాకాణి స్పష్టం చేశారు. సమావేశంలో రైతు భరోసా కేంద్రాల సంయుక్త సంచాలకులు శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement