అమరావతి, ఆంధ్రప్రభ: నామినేటెడ్ పదవుల భర్తీకి మళ్ళీ రంగం సిద్దమవుతోంది. కూటమి శ్రేణులు ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. ఇక ఎవరికి ఏ పదవి అన్న ఉత్కంఠ మళ్ళీ నేతల్లో మొదలైంది. ఇప్పటికే నామినేటెడ్ పదవుల పందేరం పూర్తి కావాల్సి ఉన్నప్పట్టికీ వరదలు, వర్షాల నేపథ్యంలో ఈ ప్రక్రియ కాస్త వెనక్కు వెళ్ళింది.
ఇప్పుడు రాష్ట్రంలో వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టడంతో కూటమి సర్కార్ నామినేటెడ్ పోస్టుల భర్తీ పై మరోసారి కసరత్తును మెదలుపెట్టింది. గతంలోనే 80 శాతం మేర పోస్టుల భర్తీ పై కసరత్తు, వడపోత పూర్తయింది. మిగిలిన కసరత్తును కూడా పూర్తి చేసి ఈ నెల ఆఖరు లోగా నామినేటెడ్ పదవుల పందేరం ప్రారంభించే యోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో నామినేటెడ్ పదవులపై క్లారిటీ ఇచ్చిన కూటమి నేతలు, రాష్ట్ర స్థాయి పదవులపై కసరత్తు కొలిక్కి రావడంతో ఇక నామినేటెడ్ పదవుల జాతరకు తెరలేవనుంది.ఏ పార్టీకి ఎన్ని పదవులు… ముఖ్యమైన పదవులు ఎవరికి.. మూడు పార్టీల మధ్య ఇప్పటికే ఒక అవగాహన కుదిరిన నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. తొలి 100 రోజుల్లోనే ఈ పోస్టులను భర్తీ చేస్తామని కూటమి అగ్రనేతలు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు పదవుల కోసం నేతలు ఎదురు చూస్తున్నారు.
రేషియో ప్రకారమే పదవుల కేటాయింపు
మూడు పార్టీల మధ్య పదవుల పంపకంపై కుదిరిన ఒప్పందం ప్రకారం టీడీపీకి 60 శాతం, జనసేనకు 30 శాతం, మిగిలిన పది శాతం పదవులు బీజేపీకి దక్కుతాయని నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రంలో మిగిలిన నామినేటెడ్ పోస్టులు, ఆలయాలు, ట్రస్టు బోర్డు పాలకవర్గాలపై కూటమి సర్కార్ దృష్టి పెట్టింది.
మరోవైపు నియోజకవర్గ, జిల్లా స్థాయిలో భర్తీ చేయాల్సిన పోస్టుల పైన పూర్తి స్థాయి నివేదికను తెప్పించుకుంది. అందరికీ న్యాయం జరిగేలా ఫార్ములాను సిద్ధం చేశారు. ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న టీడీపీ నేతలు నామినేటెడ్ పదవులపై గంపెడాశలు పెట్టు-కున్నారు.
ఇదే సమయంలో జనసేన, బీజేపీ నేతలు నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.కూటమి గెలుపుతో మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు కీలకంగా పనిచేయడంతో అందరికీ ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.
కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉండగా, నియోజకవర్గాన్ని ఓ యూనిట్‌గా తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట్ల 60 శాతం పదవులు పసుపు దళానికి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మిగిలిన 40 శాతంలో జనసేన నేతలకు 30 శాతం,బీజేపీకి 10 శాతం పదవులు ఇస్తారని చెబుతున్నారు.
ఇక అదేవిధంగా జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో 60 శాతం జనసేన, 30 శాతం టీడీపీ, 10 శాతం బీజేపీ నేతలకు పదవులివ్వాలని నిర్ణయించారని సమాచారం. ఇదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఆ పార్టీకి 50 శాతం,మిగిలిన 50 శాతం పదవుల్ని తెలుగుదేశం, జనసేన చెరిసగం తీసుకోవాలని నిర్ణయించారని సమాచారం.
నియోజకవర్గ స్థాయిలో పదవుల పంపకంపై క్లారిటీ…
నియోజక వర్గ స్థాయిలోని పదవుల పంపకం పై స్పష్టత రావడంతో నేతలు, కార్యకర్తల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్రస్థాయిలో కుదిరిన ఫార్ములాతో మూడు పార్టీల్లో కార్యకర్తలు అందరికీ సమ ప్రాధాన్యత దక్కే అవకాశాలు ఉండటంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది.
సీఎం చంద్రబాబు గుజరాత్ పర్యటన ముగియగానే జిల్లా, నియోజకవర్గ స్థాయి పదవుల భర్తీపై నిర్ణయం తీసుకోవచ్చనంటున్నారు. ఇప్పటికే పదవులపై ఆశగా ఎదురుచూస్తున్న తెలుగు తమ్ముళ్లు తొలి జాబితా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఇక జన సైనికులు పదేళ్లుగా అధికారం రుచిచూడలేదు. ఇప్పుడు ప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామిగా ఉండటంతో రాష్ట్రస్థాయి పదవులలో భారీ వాటా దక్కుతుందన్న ఆనందంలో ఆ పార్టీ నేతలు ఉన్నారు.ఇక రాష్ట్రవ్యాప్తంగా పది శాతం వాటా పదవులు బీజేపీకి దక్కనున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు హ్యాపీ మూడ్ లో ఉన్నారు.
తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నచోట సగం పదవులు దక్కడం తో పాటు మరో పది శాతం రాష్ట్ర స్థాయి పదవులు దక్కనున్న నేపథ్యంలో కమలం పార్టీలో సంతృప్తి వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో ఈ నెల 25,26 తేదీల్లో రాష్ట్రస్థాయి పదవుల తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉందని టీడీపీ ముఖ్య నేతలు భావిస్తున్నారు.
ఆలయాలకు పాలకవర్గాల నియామకం…
నామినేటెడ్ పోస్టులతోపాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలైన టీటీడీ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గ ఆలయాలకు పాలకవర్గాలను కూటమి ప్రభుత్వం త్వరలో నియమించనుంది. ఈ నెలాఖరులోగా టీటీడీ బోర్డును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని కార్పొరేషన్ పోస్టులను భర్తీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.