అమరావతి, ఆంధ్రప్రభ : మంగళవారం అసెంబ్లి బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజు నూతన గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన రాలేదు. ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో చేపట్టిన మిగతా అన్ని పనులపై గవర్నర్ ప్రసంగించారు. మరోవైపు మూడు రాజధానుల ప్రస్తావన లేకపోయినా వికేంద్రీకరణ అంశాన్ని మాత్రం గవర్నర్ ప్రస్తావించారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు పెంచామని గవర్నర్ తెలిపారు. తన ప్రసంగంలో ప్రభుత్వ పథకాలు, ఇతర అంశాలను ప్రస్తావించిన ఆయన మూడు రాజధానుల అంశం మాత్రం ఎక్కడా కనిపించకుం డా, వినిపించకుండా జాగ్రత్తపడ్డారు. అయితే, వికేంద్రీకరణ పేరును గవర్నర్ ప్రస్తావించినా విశాఖ రాజధానిగా ఉంటుం దన్న అర్థం స్ఫురించే రీతిలో ఆయన ఎక్కడా ప్రసంగించ లేదు. ఇదిలా ఉండగా తొలి రోజు గవర్నర్ ప్రసంగం పూర్త య్యాక కేబినెట్ భేటీ జరిగింది. సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ భేటీలో సీఎం జగన్ విశాఖ రాజధానిగా ఉంటుందంటూ సహచర మంత్రుల వద్ద ప్రస్తావించారు. ఇప్పుడిది రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.
సభ్యుల్లోనూ చర్చ:
ఇదిలా ఉండగా, తొలిరోజు అసెంబ్లిd సమావేశం తర్వాత సభ నుండి బయటకు వచ్చిన అధికార, విపక్ష సభ్యుల మధ్య ఈ అంశంపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. గవర్నర్‌కు రాసిచ్చిన ప్రసంగంలో మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం ఎందుకు రాసివ్వలేదని కొందరు, రాసిచ్చినా గవర్నర్ దానిని చదవలేదా అంటూ మరికొందరు తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులు సెటైర్లు వేసుకున్నారు. అదేతరుణంలో తామేమీ తక్కువ కాదన్నట్లు అధికార వైకాపా సభ్యులు కూడా మా నాయకుడు ‘చెప్పాడంటే.. చేస్తాడంతే’ అంటూ కౌంటర్ సెటైర్లు విసిరారు. ఆరు నూరైనా విశాఖ రాజధానిగా చేసి తీరుతామని స్పష్టంచేశారు. మీరంతా ఇలానే కథలు, కథనాలు వినిపిస్తూ ఉంటే మేము విశాఖ వెళ్లి అక్కడ నుండి పాలన మొదలు పెడతామంటూ చెప్పుకొచ్చారు. దీంతో సభ అనంతరం లాబీల్లో అధికార, విపక్ష సభ్యుల మధ్య నవ్వుల పువ్వులు వెల్లివిరిశాయి.
మంత్రివర్గ సమావేశం తరువాత కూడా ఇదే :
తొలి రోజు సభ ముగిశాక బీఏసీ సమావేశం జరిగింది. అనంతరం సుమారు ఒంటిగంట ప్రాంతంలో కేబినెట్ భేటీ అయ్యింది. మధ్యాహ్నం మూడు గంటల వరకూ ఈ భేటీ సుదీర్ఘంగా కొనసాగింది. ఈ భేటీ అనంతరం బయటకు వచ్చిన మంత్రులు వచ్చే విద్యాసంవత్సరం అంటే జులై నుండి విశాఖే రాజధాని అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారని చెప్పు కొచ్చారు. ఈసందర్భంగా లాబీల్లో తెదేపా సభ్యులు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ మంత్రులు కూడా సెటైరికల్‌గా మాట్లాడారు. ఏపీ ప్రజలంతా ‘మానమ్మకం నువ్వే జగనన్న’ అంటున్నారని, అంటే జగన్ మోహన్ రెడ్డి ఏది చెబితే అది చేసి తీరుతారన్న నమ్మకం వారికి కలగబట్టే ఆ నిర్ణయానికి ప్రజలు వచ్చారని మంత్రులు చెప్పుకొచ్చారు. ఏపీ రాజధానిగా విశాఖే ఉంటుందని, దీనిలో మరో అభిప్రాయం లేనే లేదన్నది సీఎం జగన్ మాటల సారాంశమని మంత్రులు చెప్పారు. అమరా వతిలో కూర్చుని పనిపాట లేకుండా మాట్లాడే వారి మాటల గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదంటూ కొట్టిపారే శారు. కరోనా వంటి కష్టకాలంలోనూ ఇచ్చిన మాట మేరకు 99 శాతం హామీలు అమలుచేసిన పట్టుదల ఉన్న వ్యక్తి తమ పార్టీ అధినేత అని, విశాఖను రాజధానిగా చేసుకుని ఆయన ముఖ్యమంత్రి హోదాలో కూర్చుని పాలన సాగించడం ఖాయమంటూ వారు స్పష్టంచేశారు.
న్యాయ పరిధిలో ఉండబట్టే:
గవర్నర్ అబ్దుల్ నజీర్ న్యాయవాదిగా, న్యాయ మూర్తి గా విశేష అనుభవం గడించిన వ్యక్తి అని, ఈ అంశం న్యాయ పరిధిలో ఉండబట్టే ఆయన తన ప్రసంగంలో ఎక్కడా దీనిని ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డారని మరికొంత మంది సభ్యు లు చెప్పుకున్నారు. ఇప్పటికే రాజ్యసభలో మూడు రాజధాను ల అంశాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించిన
ప్పుడు కూడా సభాపతి అడ్డుకున్నారని గుర్తుచేసుకున్నారు. అయితే గవర్నర్ అబ్దుల్ నజీర్ మాజీ సుప్రీంకోర్టు న్యాయ మూర్తి కావడం, రాజధాని అంశం న్యాయస్ధానం పరిధిలో ఉండటంతోనే దీనిపై మాట్లాడలేదని వారికి వారే సమర్ధించు
కున్నారు. ఇదిలా ఉండగా మరికొంత మంది సభ్యులు మాత్రం మూడు రాజధానుల వ్యవహారంపై ప్రభుత్వం పట్టు-దలగా ఉందని, అందుకే,ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న ఈ అంశాన్ని సాధ్యమైనంత త్వరగా విచారించి తీర్పు ఇవ్వాలని ఇప్పటికే పలుమార్లు కోరిందని గుర్తుచేశారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం సంక్షిష్టమైన ఈ కేసులో విచారణను వాయిదాలు వేస్తూనే ఉందని చెప్పుకున్నారు.