కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తుండటంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12 నుంచి శ్రీవారి సర్వదర్శనం నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్ల జారీని పూర్తిగా ఆపేస్తున్నట్టు తెలిపింది.
ప్రస్తుతం తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసాల వద్ద భక్తులకు సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తున్నారు. ఈ టికెట్ల కోసం వస్తున్న భక్తులు గుంపులుగా గుంపులుగా సంచరిస్తున్నారు. తాజా పరిస్థితుల్లో ఇది ప్రమాదకరం కావడంతో టీడీపీ సర్వదర్శన టైమ్ స్లాట్ టోకెన్లను నిలిపివేస్తోంది. ఈనెల 11వ తేదీ సాయంత్రం వరకు మాత్రమే ఈ టోకెన్లను జారీ చేయనున్నట్టు స్పష్టం చేసింది. అయితే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు యధావిధిగా కొనసాగుతాయని టీటీడీ వెల్లడించింది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి ఆలయ సిబ్బందితో సహకరించాలని సూచించింది. అలాగే తిరుమలకు వచ్చేవారు కచ్చితంగా కరోనా మార్గదర్శకాలు పాటించాలని కోరింది.