Friday, November 22, 2024

జీతాల సొమ్ము గోవిందా….

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: దేవాదాయ శాఖలో అసలు ఏం జరుగు తుందో కూడా తెలియడం లేదు. సొంత శాఖ పరిధిలో పనిచేసే అర్చకులకు ఏడాదికి పైగా జీతాలు అందక అవస్థలు పడుతున్నా పట్టించుకునేవారు కనిపించ డం లేదు. కనీసం వారికి సరైన సమా ధానం చెప్పేవారు కూడా కరువవుతు న్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో సమస్య తలెత్తిందో.. లేక దేవాదాయ శాఖలో కొంతమంది అధికారులు నిర్లక్ష్యం ఫలితంగా సాంకేతిక సమస్య ఎదురైం దో..ఏమో తెలియదు కాని దేవున్నే నమ్ముకుని నిత్యం పూజలు చేసే అర్చకులు మాత్రం జీతాలు అందక అర్ధాకలితో అలమటిస్తున్నారు. జిల్లాల విభజన తర్వాత నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త జిల్లాల పరిధిలోని ఆయా ఆలయాలకు సంబంధించిన అర్చకుల్లో దాదాపుగా 50 శాతం మందికి జీతాలు రావడం లేదు. ఇదే విషయంపై ఆయా ప్రాంతాలకు చెందిన అర్చకులు జిల్లా స్థాయిలో ఏసీ ఆఫీసులకు వెళ్లి తమ సమస్యను చెప్పుకుని వినతిపత్రాలు సమర్పించారు. గత ఏడాది మే నుంచి ఇదే పరిస్థితి ఎదురవుతున్నా..అర్చకుల జీతాల సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. జిల్లాలో దేవాదాయ శాఖ అధికారులు మాత్రం ఫైలు కమిషనర్‌ ఆఫీసుకు పంపామని, అక్కడి నుండి ఇంత వరకు సమాధానం రాలేదని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారే తప్ప జీతాలు అందకపోవడానికి గల ప్రధాన కారణాలు మాత్రం చెప్పలేకపోతున్నారు. దీంతో కొంతమంది అర్చకులు తమ ప్రాంతాలకు చెందిన ప్రజా ప్రతినిధులతో కమిషనర్‌ ఆఫీసుకు సిఫారసు చేయించుకుని జీతాల సమస్యను అధిగమిస్తున్నారు. అయితే అప్పటివరకు జరిగిపోయిన నెలలకు సంబంధించి జీతాలు ఇవ్వకుండా ఆ నెల నుంచి మాత్రమే కొత్తగా జీతాలను అర్చకుల ఖాతాలో వేస్తున్నారు. ఇక్కడే ఏదో మతలబు జరుగుతుందన్న సందేహాలు అర్చకుల్లో వ్యక్తమవుతుంది.

దేవాదాయ శాఖలో..వేతనాల మాయాజాలం
రాష్ట్రంలో గత ఏడాది ఏప్రిల్‌లో కొత్త జిల్లాల విభజన జరిగింది.13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా పాత జిల్లాల పరిధిలో ఉన్న కొన్ని మండలాలను కలుపుతూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. దేవాదాయ శాఖ పరిధిలోని వివిధ ఆలయాలు కూడా కొత్త జిల్లాల పరిధిలోకి వెళ్లాయి. అయితే రూ. 25 వేల నుంచి రూ.లక్ష లోపు ఆదాయం వచ్చే ఆలయాలకు సంబంధించిన ఆర్చకులకు దేవాదాయ శాఖ ప్రతి నెల రూ.5 వేలు గౌరవ వేతనాన్ని అందిస్తుంది. అందుకు సంబంధించిన అర్చకుల వివరాలను కొత్త జిల్లాలతో అనుసందానమైన ప్రాంతాలకు సంబంధించిన వివరాలను ఆయా జిల్లాలకు చెందిన ఏసీ కార్యాలయాల ద్వారా కమిషనరేట్‌కు పంపుతూ ఆ దిశగా మార్పు చేయాల్సి ఉంది. అయితే పాత జిల్లాల నుంచి కొత్త జిల్లాల్లో కలిసిన కొన్ని ఆలయాలకు సంబంధించిన వివరాలను పంపడంలో జాప్యం జరగడం, ఆ దిశగా రికార్డులు నమోదు చేయడంలో కొన్ని జిల్లాల అధికారులు నిర్లక్ష్యం వహించడం తదితర కారణాలు వెరసి కమిషనరేట్‌ రికార్డుల్లో కొంతమంది అర్చకుల పేర్లు కనిపించడం లేదు. దీనిని అదునుగా తీసుకుని కమిషనర్‌ కార్యాలయంలో కొంతమంది అధికారులు తమ చేతి వాటాన్ని చూపినట్లు తెలుస్తోంది. రికార్డుల్లో అర్చకుల పేర్లు లేకపోవడం, ప్రతినెల వారికి చెల్లించాల్సిన జీతాల సొమ్మును దేవాదాయ శాఖలోనే నిల్వ చూపాల్సి ఉన్నప్పటికీ కొన్ని జిల్లాలకు సంబంధించి జీతాలిస్తున్నట్లుగా వేతనాల జాబితాలో మాయాజాలం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సిఫారసు చేసుకున్న వారికి..కొత్తగా జీతాలు మంజూరు
దేవున్ని నమ్ముకుని నిత్యం పూజలు చేస్తూ ఆలయాల ఆలనాపాలనా చూస్తున్న అర్చకులకు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. ఉదయం నిద్రలేచిన మొదలు రాత్రి పడుకునే వరకు దేవాలయాల్లోనే ఉంటూ ఆలయాల్లో పూజలు చేసే పూజారులు తమకు వస్తున్న కొద్దిపాటి జీతాల కోసం కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో జీతాలు అందక అవస్థలు పడుతున్న అర్చకులు తమ తమ ప్రాంతాలకు చెందిన ప్రజా ప్రతినిధులతో సిఫారసులు చేయించుకుని కొత్తగా జీతాలను మంజూరు చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. అయితే సిఫారసులతో అర్చకుల పేర్లను తిరిగి కొత్త జిల్లాల్లో చేర్పి రూ.5 వేలు వేతనాన్ని అందిస్తున్నప్పటికీ గడిచిపోయిన నెలలకు సంబంధించిన పాత జీతాలను మాత్రం ఇవ్వడం లేదు. అదేమని ప్రశ్నిస్తే ఆ జీతాలకు సంబంధించి బిల్లు పెట్టలేదు కదా, ప్రస్తుతం కొత్తగా మంజూరు అయిన జీతాలను మాత్రమే ఇక క్రమం తప్పకుండా వస్తాయి, సర్దుకుపోండంటూ కొంతమంది అధికారులు అర్చకులను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు అర్చకులకు జీతాలు ఎందుకు ఆగాయో..ఆ సొమ్మంతా అసలు ఏమైందో..? సమాధానం చెప్పేవారే కరువవుతున్నారు. ఈ వ్యవహారంపై దేవాదాయ శాఖలో కొత్త చర్చ కూడా జరుగుతోంది. జిల్లాల విభజన దేవాదాయ శాఖ అధికారులకు కలిసొచ్చిందని, పథకం ప్రకారమే కొంతమంది జీతాలను సాంకేతిక సమస్య పేరుతో నిలిపివేసి ఆ సొమ్మును మాయం చేశారన్న అనుమానాలను కూడా కొంతమంది అర్చకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం విచారిస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. అదేవిధంగా నేటికి జీతాలు అందక కమిషనర్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న అర్చకుల సమస్యను కూడా పరిష్కరించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement