అమరావతి, ఆంధ్రప్రభ: కృష్ణా నది మీద నిర్మించిన పులిచింతల ప్రాజెక్టు నిర్వహణా లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. గతంలో భారీగా వచ్చిన వరద ఉధృతికి ఒక క్రస్టు గేట్ కొట్టుకుపోయిన సంగతి విదితమే. 2021 ఆగస్టులో కొట్టు-కుపోయిన రేడియల్ క్రస్టు గేట్‌లలో (నెం. 16) ఒకదానిని తాత్కాలికంగా ఏర్పాటు- చేయడం మినహా దానిని పూర్తిస్థాయిలో పునరుద్ధరించలేదు. ఈ సంఘటన మరువకముందే తాజాగా ప్రాజెక్టులో భూకంపాలను పసిగట్టే పరికరం పనిచేయడం లేదన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 19వ తేదీ ఆదివారం పులిచింతల ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో అటు తెలంగాణ, ఇటు ఆంధ్రాల్లో స్వల్పంగా భూమి కంపించింది. భూమి కంపించిన సమయంలో ప్రాజెక్టులో 24 రేడియల్ క్రస్టు గేట్లు- పరిధిలో పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.7 టీ-ఎంసీలకు గానూ దాదాపు 42 టీ-ఎంసీల నీరు నిల్వ ఉన్నట్లుతెలుస్తోంది. భూమి కంపిచిన సమయంలో ప్రాజెక్టులో ఉన్న భూకంప తీవ్రతను నమోదు చేసే పరికరం పనిచేయడం లేదన్న సంగతిని అధికారులు గుర్తించారు. భూకంప కార్యకలాపాలను నమోదుచేసే పరికరం లోపభూయిస్టంగా పనిచేస్తోందని ఈనెల 19న వచ్చిన భూకంపం సంభవించిన సమయంలో ఈ పరికరంలో తీవ్రత నమోదు ఎంత ఉన్నదానిని పరిశీలించిన సమయంలో అధికారుగులు గుర్తించారు. అంతేతప్ప అంతకుముందు ఈ పరికరం పనిచేయడంలేదన్న విషయాన్ని అధికారులు దీనిని గుర్తించలేకపోయారు. ప్రాజెక్టు ప్రారంభం నుండి నిర్వహణ లోపం ఉండంటం వల్లే ఈ పరికరం పనిచేయడం మొరాయించిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఏవిధంగా చూసినా రిక్టర్ స్కేల్‌పై 3.0 తీవ్రతతో వచ్చే భూ ప్రకంపనల ప్రభావాన్ని కూడా అది నమోదు చేయలేదని ఆదివారం నాడు వచ్చిన భూప్రకంపనల సందర్భంలో వెల్లడైందని తెలుస్తోంది.
19న స్వల్పంగా కంపించిన భూమి :
ఈనెల 19వ తేదీ ఆదివారం తెల్లవారుజామున ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.0 తీవ్రత ఉన్నట్లుగా నమోదైంది. దీంతో పులిచింతల జలాశయంతోపాటు- దాని పరిసరాల్లో ఉన్న కొన్ని గ్రామాల్లో ఈ ప్రకంపనలను ప్రజలు స్పష్టంగా గుర్తించారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చింతలపాలెం వద్ద భూకంప కేంద్రం ఉన్నట్లు- శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే, భూమి స్వల్పంగా కంపించడంతో ప్రాజెక్టుకు ప్రమాదమేమీ సంభవించలేదని, అందుకే ప్రాజెక్ట్‌పై దాని ప్రభావం పెద్దగా కనిపించలేదని అధికారులు వెల్లడించారు. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ) నుండి వచ్చిన నివేదిక ఆధారంగా ప్రాజెక్ట్ వద్ద రిక్టర్ స్కేలుపై 2.0 తీవ్రత మాత్రమే నమోదైందని జలవనరుల అధికారులు చెబుతున్నారు. రిక్టర్ స్కేల్‌పై 4.0 నుండి 6.0 తీవ్రతతో ప్రకంపనలను తట్టు-కునేలా ప్రాజెక్ట్ రూపొందించబడిందని వారు పేర్కొంటు-న్నారు. అందువల్ల ప్రాజెక్ట్ సమీపంలో కేవలం 2.0 తీవ్రతతో ప్రకంపనలు రావడం వల్ల ప్రాజెక్టుపై పెద్ద ప్రభావాన్ని చూపకపోవచ్చని చెబుతున్నారు.
నిర్వహణాలోపంతోనే మొరాయింపు :
పులిచింతల ప్రాజెక్టులో భూకంప తీవ్రతను, దాని ప్రభావాన్ని నమోదు చేసేందుకు అంతర్నిర్మిత సీస్మిక్ ఇన్‌స్ట్రుమెంటేషన్ సదుపాయం ఉన్నప్పటికీ, కొంత కాలంగా సక్రమ నిర్వహణ లేకపోవడం వల్ల అది నిర్వీర్యమైందని అంటు-న్నారు. ఏది ఏమైనప్పటికీ, ప్రాజెక్ట్ వద్ద సంభవించిన భూకంపం యొక్క ఖచ్చితమైన పరిమాణాన్ని అంచనా వేయడానికి, అవసరమైతే పునరుద్ధరణ పనులను చేపట్టడానికి నీటి వనరుల అధికారులు ఎన్‌జీఆర్‌ఐ స్థానిక అధికారులతో సంప్రదించి ప్రభావ అంచనాను ప్లాన్ చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులో సీస్మిక్ ఇన్‌స్ట్రుమ్రెంటేషన్ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో కొంతకాలంగా అది పని చేసే పరిస్థితి లేదు. ప్రాజెక్ట్ సమీపంలో ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై కేవలం 2.0 మాత్రమే కాబట్టి ప్రాజెక్ట్‌పై పెద్దగా ప్రభావం చూపలేదు. అదే తీవ్రత పెరిగి ఉంటే పెను ప్రమాదం సంభవించి ఉండేదని సాగునీటి రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టిసారించి నిర్వహణను సరిగ్గా చేపట్టేలా సత్వరమే చర్యలు చేపట్టాలని సాగునీటి రంగ నిపుణులు సూచిస్తున్నారు.