న్యూఢిల్లీ : వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎటువంటి రిలీఫ్ లభించలేదు. తన తల్లి అనారోగ్యంగా ఉన్నందున సీబీఐ విచారణకు హాజరుకాలేకపోతున్నానని, తనను సీబీఐ అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ అవినాష్ వేసిన పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై వాదోపవాదాలు జరిగిన సందర్భంలో సీబీఐ నోటీసులకు అవినాష్ ఎందుకు స్పందించడం లేదని ఆయన న్యాయవాదిని ప్రశ్నించింది. కేవలం తల్లి అనారోగ్యం కారణంగానే సీబీఐ విచారణకు వాయిదా కోరుతున్నట్లు వారు పేర్కొన్నారు.
కాగా ప్రస్తుతం సుప్రీంకోర్టు సమ్మర్ సెలవుల్లో ఉండడం వల్ల పూర్తిస్థాయి విచారణ చేపట్టలేమంటూ హైదరాబాద్ లోని హైకోర్టు వెకేషన్ బెంచ్ కు 25వతేదీన వెళ్లవలసిందిగా ఆదేశించింది. అలాగే అవినాష్ పిటిషన్ పై అదేరోజు విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇవ్వవలసిందిగా సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. అయితే 25వతేదీ వరకు తనను అరెస్టు చేయకుండా సీబీఐకి ఉత్తర్వులు ఇవ్వవలసిందిగా అవినాష్ న్యాయవాదులు అభ్యర్థించారు. అందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.