Tuesday, November 26, 2024

జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ల‌లో ప్రొటోకాల్ కు మంగ‌ళం..

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభల్లో ప్రసంగించడానికి అవకాశం ఉన్న ప్రతిఒక్కరు పోటీపడుతుం టారు. ఎవరికి వారే మాట్లాడే ఛాన్స్‌ కోసం చివరి వరకు ఎదురు చూస్తుంటారు. అందుకోసం అవసరం అయితే సిఫారసులు కూడా చేయించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే సీఎం పాల్గొనే అధికారిక సభల్లో ప్రోటోకాల్‌ ప్రకారమే మంత్రులు, శాసనసభ్యులకు అధికారులు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. కానీ అందుకు పూర్తి భిన్నంగా సీఎం జగన్‌ బహిరంగ సభల్లో ఇన్‌చార్జ్‌ మంత్రులు, ఆయా శాఖల మంత్రులతో పాటు జిల్లా మంత్రులకు మైక్‌ దొరకడం కష్టంగా మారిపోతోంది. వివిధ సభల్లో అధికారులు ప్రోటోకాల్‌ను పాటించ డం లేదు. దీంతో పలువురు మంత్రులు మాట్లాడే అవకాశాన్ని కోల్పో తున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే అవమానానికి కూడా గురి కావాల్సి వస్తోంది. ప్రోటోకాల్‌ విధానంలో మార్పులేవైనా చేశారా.. లేక అధికారులు ప్రోటోకాల్‌ను మరుస్తున్నారా లేక ఉద్దేశ్యపూర్వకం గానే ఆయా జిల్లాల్లో మంత్రుల ప్రాధాన్యతను తగ్గించేందుకు వారికున్న అవకాశాలను దూరం చేస్తున్నారా..అన్న సందేహాలు పార్టీ శ్రేణుల్లోనూ, పలువురు మంత్రుల్లోనూ వ్యక్తమవుతున్నాయి. ఒక్కటి కాదు రెండు కాదు వరుసగా అనేక బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సభను ఉద్దేశించి మాట్లాడటానికి ముందు ప్రోటోకాల్‌ ప్రకారం స్థానిక మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి, ఆయా శాఖలకు సంబంధించిన మంత్రి ఇలా వరుసగా ముగ్గురు మంత్రులకు కనీసం ఒకట్రెండు మాటలు మాట్లాడేందుకు అయినా అవకాశం కల్పించడం లేదు. ఈ వ్యవహారంపై పలువురు మంత్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇటీవల ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డిని వేదికపైకి ఆహ్వానించకపోవడాన్ని గమనించిన సీఎం జగనే స్వయంగా ఆయన్ను వేదిక పైకి పిలిచారు. ఈ వ్యవహారం అప్పట్లో ప్రకాశం జిల్లాలో ప్రకంపనలు సృష్టించింది. రెండు రోజుల క్రితం నెల్లూరు జిల్లా కావలి పర్యటనకు సీఎం జగన్‌ వచ్చిన సందర్భంలోనూ స్థానిక మంత్రులకు మాట్లాడే అవకాశం కల్పించలేదు. తాజాగా మంగళవారం బాపట్ల మత్స్యకార సభలో సంబంధిత శాఖ మంత్రి సీదిరి అప్పలరాజుకు ప్రోటోకాల్‌ ప్రకారం మాట్లాడే అవకాశం ఇవ్వాల్సి ఉన్నప్పటికి ఆయనకు ఆ ఛాన్స్‌ రాలేదు. దీంతో ఆయన బుధవారం సీఎంవో అధికారులకు ప్రోటోకాల్‌ వ్యవహారాన్ని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

కావాలనే మార్చేస్తున్నారా..?
సీఎం జిల్లాల పర్యటనకు వస్తున్నారంటే వారం రోజుల ముందు నుంచే అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తుంటారు. సభ ఏర్పాట్లతో పాటు వేదికపై ప్రోటోకాల్‌ మేరకు చైర్స్‌ను కూడా సంఖ్యను బట్టి ఏర్పాటు చేస్తారు. అలాగే సభ ప్రారంభం అయ్యాక ఎవరెవరికి మాట్లాడే అవకాశం కల్పించాలి అనే అంశంపై కూడా ముందుగానే చర్చించి ప్రోటోకాల్‌ ప్రకారం జిల్లా కలెక్టర్‌, స్థానిక ఎమ్మెల్యే, స్థానిక జిల్లా మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి, సంబంధిత శాఖ మంత్రి, ఇంకా అవకాశం ఉంటే పార్లమెంట్‌ సభ్యులకు కూడా మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తారు. అయితే సీఎం జగన్‌ బహిరంగ సభల విషయంలో మాత్రం ప్రోటోకాల్‌ అధికారులు కావాలనే మంత్రులకు మాట్లాడే అవకాశం కల్పించడం లేదన్న వ్యాఖ్యలు పలువురు మంత్రుల నుంచి వ్యక్తమవుతున్నాయి. కొంతమంది మంత్రులు అయితే ప్రోటోకాల్‌ వ్యవహారంపైనే తరచూ చర్చించుకుంటూ సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లలేక మౌనంగా ఉండిపోతున్నారు. సీఎంవోలో కొంతమంది అధికారులు కావాలనే ప్రోటోకాల్‌ రూల్స్‌ను ఉల్లంఘిస్తున్నారన్న అభిప్రాయం కూడా పలువురు మంత్రుల్లో వ్యక్తమవుతోంది. ఇదే విషయంపై బుధవారం మంత్రి సీదిరి అప్పలరాజు సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లాలని తాడేపల్లికి వెళ్లినట్లు చెబుతున్నారు. అయితే అక్కడ ఏం జరిగిందో తెలియదు కాని ఐఏఎస్‌ ధనుంజయరెడ్డితో ఆయన భేటీ అయి బాపట్లలో జరిగిన వ్యవహారాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

శాఖల మంత్రులకు..అందని మైకు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇటీవల కాలంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అధికారిక సభలు కూడా నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు సీఎం సభలకు హాజరవుతున్నారు. ఈ నేపధ్యంలోనే వారంతా సీఎం ప్రసంగంతో పాటు స్థానికంగా తమ మంత్రుల ప్రసంగాలను కూడా వినాలని ఎంతో ఉత్సాహంతో సభలకు తరలివస్తారు. అయితే వివిధ జిల్లాల్లో మంత్రులకు మైక్‌ అందడం లేదు. కొంతమంది మంత్రులు మాట్లాడే అవకాశం రాకపోవడంతో అవమానానికి గురవుతున్నారు. సభ ముగిశాక తమ అనుచర వర్గమంతా మీకు మైక్‌ ఇవ్వలేదేమిటి సారూ..అంటూ ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక మంత్రులు మౌనంగా ఉండిపోతున్నారు. మరి కొంత మంది మంత్రులు అయితే మాట్లాడే అవకాశాలు ఇవ్వకపోవడంపై తమ అనుచరుల వద్ద ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో చుక్కల భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమ సభకు పెద్దఎత్తున ప్రజలు, రైతులు తరలివచ్చారు. రెవెన్యూ శాఖకు సంబంధించి మంత్రి ధర్మాన ప్రసాదరావు, స్థానిక మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఇన్‌చార్జ్‌ మంత్రి అంబటి రాంబాబులకు కనీసం 5 నిమిషాలు కూడా మాట్లాడే అవకాశాన్ని కల్పించకపోవడంపై వైసీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తమ నాయకుల ప్రసంగాలను వినాలని మండుటెండను సైతం లెక్కజేయకుండా ఆటోలు, బస్సులు పట్టుకుని సభా ప్రాంగణానికి వస్తే కనీసం వారు మాట్లాడేందుకు అవకాశం కూడా ఇవ్వలేదంటూ మంత్రులతో పాటు పార్టీ క్యాడర్‌ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా బాపట్ల సభలోనూ అదే సీను దర్శనమిచ్చింది. గ తంలో ఉత్తరాంధ్ర సభల్లోనూ అదే పరిస్థితి కనిపి ంచింది. దీంతో ప్రోటోకాల్‌ వ్యవహారంపై పలువురు మంత్రుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది మంత్రులు అయితే ఈ వ్యవహారాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లాలన్న యోచనలో కూడా ఉన్నట్లు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement