Tuesday, November 26, 2024

అధికారి లేని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ – పక్కదారి పడుతున్న పౌష్టికాహారం

గిద్దలూరు: మార్చి31(ప్రభన్యూస్) గిద్దలూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కు ఏడాది కాలంగా అధికారి లేరు. దీంతో అంగన్ వాడి కేంద్రాలలో పర్యవేక్షణ కొరవడింది. పౌష్టికాహారం పక్కదారి పడుతుందని ఆరోపణలు ఉన్నాయి. కేంద్రాలను పర్యవేక్షణ చేసి లబ్ధిదారులకు న్యాయం చేయాల్సిన సూపర్ వైజర్లు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. గిద్దలూరు లో పనిచేసిన సీడీపీవో లక్ష్మీదేవిని సాధారణ బదిలీల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేయగా ఆమె 2022 జులై 4వ తేదీ బాధ్యతల నుండి రిలీవ్ అయ్యారు. గిద్దలూరు ప్రాజెక్టు కు సీడీపీవో గా ఎవరిని నియమించక పోవడంతో కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ జాకీర్ కు బాధ్యతలు అప్పగించి ఆమె వెళ్లారు. కొత్తగా ఎవరిని నియమించగపోగా గత 10 నెలలుగా బెస్తవారిపేట సీడీపీవో కు గిద్దలూరు ప్రాజెక్ట్ బాధ్యతలు అప్పగించారు. ఆమె కూడా చుట్టపు చూపుగా అపుడపుడు వచ్చి వెళ్తున్నారని అంటున్నారు.

గత 10 నెలలుగా ఐసిడిఎస్ ప్రాజెక్టు కు అధికారి లేకపోవడం..రెగ్యులర్ సీడీపీవోగా ఎవరిని నియమించకపోవడంతో అంగన్ వాడి కేంద్రాల పర్యవేక్షణ కొరవడిందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గిద్దలూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని కోమరోలు,రాచెర్ల,గిద్దలూరు మండలాల పరిధిలో సుమారు 209అంగన్ వాడి కేంద్రాలు,20 మినీ అంగన్ వాడి కేంద్రాలు ఉన్నాయి. వీటి పర్యవేక్షణ కోసం నలుగురు సూపరవైజర్లు ఉన్నారు. ఒక్కొక్క సూపర్ వైజర్ 50 కేంద్రాలను పర్యవేక్షించాల్సి రావడంతో పర్యవేక్షణ వారికి భారంగా మారిందని అంరున్నారు. 9 మంది సూపర్ వైజర్లు ఉండాలాల్సి ఉండగా కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ కేంద్రాల నిర్వహణ తీరు నీరుగారిపోతుందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. కేంద్రాల్లో చిన్నారులకు,గర్భవతులకు, బాలింతలకు అందించే పౌష్టికాహారం కొన్ని కేంద్రాల్లో సక్రమంగా అందడం లేదని, పక్కదారి పడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ కేంద్రాల నిర్వహణ పట్టించుకునేవారు లేరని పలువురు వాపోతున్నారు. కోడిగుడ్లు,పాలు పంపిణీ చేసే కాంట్రాక్టర్ చిన్న సైజ్ కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారని వాటిని తీసుకునేందుకు తల్లులు నిరాకరిస్తున్నారని కొందరు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరవమంటే కప్పకు కోపం..విడవమంటే పాముకు కోపం అన్నట్లు తమ పరిస్థితి ఉందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్ అధికారిని సీడీపీవో లేకపోవడంతో కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని కొన్ని కేంద్రాలు నామ మాత్రంగా నడుస్తున్నాయని అంటున్నారు. అంగన్ వాడి కేంద్రాల్లో ఆట వస్తువులు ఆటకెక్కాయని అంగన్ వాడి కేంద్రాల్లో ఆట పాటల ద్వారా విద్య అనే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. తద్వారా కేంద్రాలు నీరసించి పోతున్నాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి కైనా జిల్లా అధికారులు దృష్టి సారించి గిద్దలూరు ప్రాజెక్ట్ కు రెగ్యులర్ సీడీపీవోను నియమించి కేంద్రాల బలోపేతానికి కృషి చేయాలని తల్లిదండ్రులు ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement