Wednesday, November 27, 2024

AP | ఎక్కడా రీపోలింగ్‌ అవసరం లేదు : ముకేష్ కుమార్ మీనా

ఏపీలో ఇంకా 3500 పోలింగ్‌ స్టేషన్లలో పోలింగ్‌ జరుగుతుందని ఏపీ సీఈవో ముకేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద 100 నుంచి 200 మంది వరకు ఓటర్లు ఉన్నారన్నారు. పది గంటలకల్లా అన్ని చోట్లా పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుందని మీనా వివరించారు. పోలింగ్ శాతం బాగా పెరిగిందని.. గత ఎన్నికల పోలింగ్ శాతం కంటే ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నామని.. ఇప్పుడే పోలింగ్ శాతం చెప్పలేమని తెలిపారు. ఎక్కడా రీ-పోలింగ్ అవసరం లేదని భావిస్తున్నామని ఆయన అన్నారు

17A స్క్రూట్నీ తర్వాతే రీ-పోలింగ్ విషయంలో నిర్దారిస్తామన్నారు. రీ-పోలింగ్ కోసం ఎలాంటి రిక్వెస్టులు రాలేదన్నారు. తెనాలి, నరసరావు పేట ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశామన్నారు. ఈవీఎం యూనిట్లను స్ట్రాంగ్ రూంలకు తరలిస్తున్నామని.. ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చారన్నారు. ఈవీఎం మెషీన్లతో కొన్ని ఇబ్బందులు వచ్చాయని.. సాంకేతిక ఇబ్బందులు గతంతో పోల్చుకుంటే తక్కువగా ఉన్నాయన్నారు. బందోబస్తు పెద్ద ఎత్తున పెట్టామన్నారు. సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేశామన్నారు. ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని సీఈవో చెప్పుకొచ్చారు.

కొన్ని చోట్ల ఘర్షణలు జరిగినా కట్టడి చేశామన్నారు. పల్నాడులో 12 చోట్ల ఘర్షణలు జరిగాయని.. పల్నాడులో ఒక చోట ఈవీఎంను ధ్వంసం చేశారు.. ఈవీఎంలోని చిప్‌లో డేటా భద్రంగా ఉందన్నారు. ఈవీఎంలను మార్చి మళ్లీ పోలింగ్ ప్రారంభించామన్నారు. అన్నమయ్య జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగిందని.. 11 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారన్నారు. అక్కడ మిషన్లు మార్చి పోలింగ్ పునరుద్ధరించామని చెప్పారు.పల్నాడు, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో అదనపు బలగాలు మోహరించాయన్నారు. పీలేరులో ఏజెంట్ల కిడ్నాప్ ఘటన జరిగినా.. వెంటనే సమస్య పరిష్కరించామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement