Friday, November 22, 2024

అధికారులు ‘కారుణ్యం’ చూపేనా…

అమరావతి, ఆంధ్రప్రభ: ఆర్టీసీ(పీటీడీ)లో కారుణ్య నియామకాలకు ఎప్పటికప్పుడు బ్రేకులు పడుతున్నాయి. అధికారులు అదిగో..ఇదిగో అంటున్నారే తప్ప నియామకాలపై నిర్థిష్టమైన చర్యలు తీసుకోవడం లేదు. తాజాగా 2016 జనవరి నుంచి 2019 డిసెంబర్‌ వరకు ఉన్న కారుణ్య నియామకాల ప్రక్రియ చేపట్టేందుకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో పలు కుటుంబాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే కారుణ్య నియామకం(బ్రెడ్‌ విన్నర్‌ స్కీము) కోసం ఎదురు చూస్తున్న వందల కుటుంబాలు ఈసారైనా సజావుగా సాగుతాయనే ఆశాభావంతో ఉన్నారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలపై ఎప్పటి నుంచో ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు కూడా పలు సందర్భాల్లో కారుణ్య నియామాలకు చేపట్టాలంటూ ఉన్నతాధికారు లకు వినతి పత్రాలు ఇస్తున్నా..అటు వైపు నుంచి మాత్రం స్పందన అంతంత మాత్రం గానే ఉంది. ఇతర శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వాలంటూ ప్రభుత్వ ఆదేశాల నేపధ్యంలో కారుణ్య నియామకాల జాబితాను జిల్లా కలెక్టర్లకు పంపినప్పటికీ..అరకొర మందికి తప్ప అందరికీ ఇవ్వడం లేదు. ఆర్టీసీ ఉద్యోగాల్లోనే సర్థుబాటు చేసుకోవాలంటూ కలెక్టర్ల నుంచి పలు దరఖాస్తులు వెనక్కి వస్తున్నాయి. పెద్ద ఎత్తున దరఖాస్తులు పేరుకుపోతుండటంతో..ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎండీ తిరుమల రావు మరోసారి ఉత్తర్వులు జారీ చేశారు.

2015 నుంచి పెండింగ్‌..
రాష్ట్ర విభజన తర్వాత 2015 నుంచి కారుణ్య నియామకాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులను 2020 జనవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వంలో విలీనం చేశారు. అప్పటికే వెయ్యి వరకు ఉద్యోగుల కుటుంబ సభ్యుల దరఖాస్తులు కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్నాయి. కోవిడ్‌-19 తొలి, మలి దశల్లో మరో 360 మంది వరకు ఉద్యోగులు మృతి చెందగా కారుణ్య నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఆ తర్వాత కూడా మరో రెండొందల వరకు కారుణ్య నియామకాల కోసం దరఖాస్తులు రాగా అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కోవిడ్‌-19 నేపథ్యంలో చోటు చేసుకున్న ఘటనలను దృష్టిలో ఉంచుకొని వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల నేపధ్యంలో జిల్లా కలెక్టర్ల ద్వారా గ్రామ/వార్డు సచివాలయా ల్లో పలువురిని నియమించారు. ఇతర శాఖల్లో సైతం పెద్ద ఎత్తున కారుణ్య నియామ కాలు చేపట్టాల్సి రావడంతో ఆర్టీసీ దరఖాస్తులను పరిమితంగానే పరిష్కారమ య్యాయి. గతంలో ఎన్వీ సురేంద్రబాబు ఎండీగా కొన్ని దరఖాస్తులు పరిష్కారానికి నోచుకున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంతో ప్రభుత్వ అనుమతి కోసం అధికారులు పలుమార్లు ప్రతిపాదనలు పంపారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్వయంగా రవాణాశాఖ ఉన్నతాధికారులు, ఆర్థికశాఖ అధికారులతో చర్చలు కూడా జరిపారు. అయితే ఎప్పటికప్పుడు సుముఖత వ్యక్తం చేయడం తప్ప నిర్థిష్టమైన ఆదేశాలు అంటూ లేవు.

ఆర్టీసీలో నియామకాల కోసం..
ఆర్టీసీ, రవాణాశాఖల్లో కారుణ్య నియామకాలు చేపట్టేందుకు గతేడాది చివర్లో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాల మేరకు జూనియర్‌ అసిస్టెంట్‌ ఖాళీలను భర్తీ చేసేందుకు ఖాళీల జాబితా రూపొందిం చారు. వీరి నియామకం కోసం ఆర్టీసీకి అర్హుల జాబితా పంపాలని ఆదేశించారు. ఇప్పటి వరకైతే ఆ నియామకాలు జరగలేదని ఉద్యోగ సంఘం నేతలు చెపుతున్నారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నుంచి ఒత్తిళ్ల నేపధ్యంలో ఎట్టకేలకు ఆర్టీసీ ఉన్నతాధికారులు నియామక ప్రక్రియ చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. రెండో దశ ఉద్యోగ భర్తీలో భాగంగా ఆర్టీసీలోని పరిపాలనా విభాగంలోని ఉద్యోగాలు, కానిస్టేబుళ్లు, డ్రైవర్‌, కండక్టర్‌, శ్రామిక్‌(మెకానిక్‌) తదితర విభాగాల్లో నియామకాల కోసం ప్రధాన కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా, రీజినల్‌, జోనల్‌ స్థాయిలో వీరి నియామకానికి జాబితా సిద్ధం చేసుకోవాలంటూ ఉన్నతాధికారులు విధివిధానాలు ఖరారు చేశారు. ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ వయస్సు మీరుతున్న తరుణంలో ఈసారైనా ఉన్నతాధికారులు నియామక ప్రక్రియను వేగవంతం చేస్తారనే ఆశాభావంతో పలువురు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement