అమరావతి, ఆంధ్రప్రభ: బాలికల భవితకు పునాది వేసి బంగారు భవిష్యత్‌ను అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వాలు బాలికా సంరక్షణ కోసం వివిధ పథకాలను ప్రవేశపెడుతూ వచ్చాయి. లింగ, భేద అసమానతలను తొలగించేందుకు కొన్ని పటిష్టమైన చర్యలు తీసుకుని భ్రూణ హత్యలను నివారించేందుకు ప్రోత్సాహాలను అందిస్తూ వచ్చాయి. ముఖ్యంగా మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో అనేక చర్యలు తీసుకున్నాయి. ముఖ్యంగా ఆడ పిల్లలను చిన్న చూపు చూడకుండా వారికి మెరుగైన అవకా శాలు కల్పించాలన్న లక్ష్యంతో ముందు చూపు నిర్ణయాలు తీసుకున్నాయి. వీటిలో ప్రధానంగా ఆనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాలికా సంరక్షణ పథకాన్ని ప్రవేశపెట్టారు. 2005లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టి దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు చెందిన బాలికలకు ప్రోత్సాహకాలు అందించేందుకు నిర్ణయం తీసుకుని అమలు చేశారు. ఆడపిల్లలు జన్మించిన అనంతరం ఒకటి నుంచి ఐదేళ్ల లోపు ఉన్న వారిని ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించాం ు. జనన ధృవీకరణ పత్రం, తల్లిదండ్రుల ఆధార్‌లు, బ్యాంక్ అకౌంట్ వివరాలను అంగన్‌వాడీ కేంద్రాలలో అందజేస్తే పథకాన్ని వర్తింపజేసేందుకు ఆదేశాలిచ్చారు.
అంతేకాకుండా ఈ పథకానికి బంగారు తల్లిగా నామకరణం చేసి చట్టబద్ధత కూడా ఆనాటి ప్రభుత్వాలు కల్పించాయి. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న తల్లిదండ్రులకు ఒకే ఆడపిల్ల ఉంటే వారికి రూ. లక్ష ప్రోత్సాహాన్ని అందించాలని సమగ్ర కార్యాచరణతో పథకానికి రూపకల్పన చేశారు. అలాగే ఇద్దరు ఆడపిల్లలు ఒకే కుటుంబంలో ఉన్నట్లయితే ఒక్కొక్కరికి రూ. 35 వేలు చొప్పున పారితోషికాన్ని అందించాలని ఆదేశించారు. ఈ సొమ్ము మొత్తం బాలికల వివాహ వయసు అంటే 20 ఏళ్లు వచ్చిన అనంతరం వారికి అందేలా పథకాన్ని తీసుకువచ్చారు. అంతేకాకుండా 9వ తరగతి నుంచి ఇంటర్‌మీడియట్ పూర్తి చేసే వరకు అంటే వరుసగా నాలుగేళ్ల పాటు ప్రతి ఏడాది రూ. 1500 స్కాలర్ షిప్ అందించేలా పథకాన్ని తీసుకువచ్చి అమలు చేశారు. ఆనాడు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను అంగన్‌వాడీల ద్వారా ఎంపిక చేశారు. ఎంపికైన లబ్ధిదారులందరికీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ), ప్రభుత్వ ఆధ్వర్యంలో బీమా సౌకర్యాన్ని కల్పించి బాండ్లు అందజేయించారు. అయితే ఈ లబ్ధి ఇంత వరకు లబ్ధిదారులకు అందని పరిస్థితి నెలకొంది. దాదాపు 2020 నాటికే రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం లబ్ధిని పొందేందుకు లక్షల్లో లబ్ధిదారులు అర్హత పొందారు. గడిచిన రెండేళ్లుగా మరికొందరికి లబ్ధి పొందేందుకు అర్హత లభించినా ఆ ప్రయోజనం మాత్రం చేకూరడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4.50 లక్షల మందికి ఈ ప్రయోజనం అందాల్సి ఉన్నట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
లబ్ధిదారుల ఆవేదన..
బంగారు తల్లి లబ్ధి కోసం తల్లిదండ్రులు పడిగాపులు కాస్తున్న పరిస్థితి నెలకొంది. బాలికా సంరక్షణ పథకం బాండ్లు గడువు ముగిసినా తమకు రావాల్సిన సొమ్ములు అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం చదువుల కోసం అందించాల్సిన ఉపకార వేతనాలు కూడా అందడం లేదని చెబుతున్నారు. కనీసం ఈ లబ్ధిని ఏ శాఖ ద్వారా పొందాలో కూడా అర్థం కావడం లేదని అంగన్‌వాడీలను కలిస్తే వెలుగు కార్యాలయాన్ని సంప్రదించాలని చెబుతున్నారని అంటున్నారు. అక్కడికి వెళ్లినా నిరాశే మిగులుతుందని సరైన సమాధానం ఆ శాఖ నుంచి రావడం లేదని పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి జిల్లాలో కనీసం 35 నుంచి 40 వేల మంది లబ్ధిదారులు బంగారు తల్లి సొమ్ములు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది.
మారిన పథకం రూపురేఖలు..
ఇదిలా ఉంటే ప్రభుత్వాలు మారుతూ వస్తున్న తరుణంలో ఈ పథకం రూపురేఖలు కూడా మారుతూ వచ్చాయి. ప్రస్తుతం మా ఇంటి మహాలక్ష్మీ పేరిట పథకం అమలవుతోంది. 2013లో ఆనాటి ప్రభుత్వం ఈ పథకానికి మా ఇంటి మహాలక్ష్మీగా పేరు మార్పు చేసింది. అప్పటి నుంచి అసలు ఈ పథకం అమల్లో ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అనేకమంది ప్రయత్నాలు చేస్తున్నా వెబ్‌సైట్ మాత్రం తెరుచుకోని పరిస్థితి ఉందని తల్లిదండ్రులు చెబుతున్నారు. మరోవైపు అధికారులు మాత్రం ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి మెచ్యురిటీ బాండ్ల అంశాన్ని తీసుకువెళ్లినట్లుగా పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఆదేశాలిస్తే చెల్లింపులు జరిగేలా చూస్తామని మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.