తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారంటూ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపాయి. ఈ అంశంపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడ పోలీస్ కమిషన్ కాంతి రాణా రెక్కీ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాధా హత్యకు రెక్కీ జరిగినట్టు ఆధారాలు లభించలేదని తెలిపారు. ఈ ఘటనపై సమగ్రంగా, లోతుగా విచారణ జరిపామని వివరించారు.
విజయవాడ పోలీసులతో పాటు ఇతర దర్యాప్తు ఏజెన్సీలు కూడా రెక్కీపై దర్యాప్తు చేశాయని వెల్లడించారు. అయితే రెక్కీ నిర్వహించినట్టు ఇంత వరకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించిందని… రాధాకు గన్ మెన్లను ఏర్పాటు చేసిందని చెప్పారు. విజయవాడ పోలీసులు కూడా రాధా భద్రత కోసం అన్ని చర్యలను తీసుకున్నారని తెలిపారు. రాధా భద్రత గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అది పూర్తిగా తమ బాధ్యత అని చెప్పారు.
పోలీసు శాఖపై టీడీపీ అధినేత చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేశారని, అవి కరెక్ట్ కాదన్నారు. విజయవాడలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని సీపీ చెప్పారు. రాధా ఇచ్చిన సమాచారం తీసుకున్నామని తెలిపారు. ఎలాంటి అఫెన్స్ జరగనపుడు, క్రిమినల్ యాక్టివిటీ లేనపుడు కేసు ఎలా పెడతాం? అని సీపీ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోకుండా పోలీస్ డిపార్ట్ మెంట్ పై అసత్యాలు మాట్లాడారని చెప్పారు.
కాగా, గతేడాది డిసెంబర్ 26న గుడివాడలో నిర్వహించిన వంగవీటి రంగా 33వ వర్ధంతి సభలో పాల్గొన్న వంగవీటి రాధా.. తన హత్యకు కొందరు కుట్ర పన్నారని, రెక్కీ కూడా నిర్వహించారని సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ సమక్షంలో రాధా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపాయి. వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం వంగవీటి రాధాకు భద్రత కల్పించింది. ఇందులో భాగంగా 2+2 గన్మెన్లను కేటాయించింది. అయితే గన్ మెన్లను వంగవీటి రాధా తిరస్కరించారు. అభిమానులే తనకు రక్షణ అని చెప్పారు. అనంతరం వంగవీటి రాధా ఇంటి సమీపంలోనే ఇటీవల అనుమానాస్పద స్థితిలో ఉన్న స్కూటీని ఆయన అనుచరులు గుర్తించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital