విజయవాడ – ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గ గుడిలోకి సెల్ ఫోన్ నిషేధం ఉంది. అయితే కొందరు భక్తులు మాత్రం అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి.. ఆలయంలోకి సెల్ ఫోన్ తీసుకెళ్లడమే కాదు.. అక్కడ వీడియోలు తీసిన ఘటనలు వెలుగులోకి రావడంతో ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకునే భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయంలోకి సెల్ ఫోన్ తీసుకెళ్లకుండా కఠినంగా వ్యవహరించేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సెల్ ఫోన్‌లను ఆలయంలోకి తీసుకెళ్లకుండా సెక్యూరిటీ ఏజెన్సీకి ఆలయ ఈవో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలి కాలంలో అమ్మవారి మూల విరాట్‌తో పాటు ఆర్జిత సేవలను వీడియో తీయడం అధికమైంది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం అమ్మవారికి సాయంత్రం వేళ పంచహారతుల సేవ జరుగుతుండగా.. ఓ భక్తుడు సేవను వీడియో తీయడం ఆలయ ఎస్పీఎఫ్ సిబ్బంది గమనించి.. భక్తుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ తరహా ఘటనలు పునరావృతం అవుతుండటంతో.. ఆలయంలోకి సెల్ ఫోన్ నిషేధాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆలయ ఈవో అధికారులను ఆదేశించారు. ఇకపై సెల్ ఫోన్ తో ఏ భక్తుడిని ఆలయంలోకి అనుమతించబోరు..
ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకునే సామాన్య భక్తులు.. సర్వదర్శనం క్యూలైన్ ద్వారా దర్శనం చేసుకుంటారు. అయితే.. క్యూలైన్‌లోకి ప్రవేశించే ముందుగానే.. భక్తులను సెక్యూరిటీ సిబ్బంది, సెల్‌ఫోన్ కౌంటర్ కాంట్రాక్టర్ సిబ్బంది తనిఖీ చేస్తారు. ఆ తర్వాతే లోపలికి అనుమతిస్తారు. కొండ దిగువన మహా మండపం, టర్నింగ్ క్యూలైన్ల వద్ద ఇదే పరిస్థితి ఉంటుంది. అయితే.. వీఐపీలు, సిఫార్సులపై వచ్చే వారు మాత్రం నేరుగా సమాచార కేంద్రానికి వెళ్లి.. అక్కడి నుంచి దర్శనానికి వెళ్తారు. ఇలా వచ్చే వారికి మాత్రం తనిఖీలు ఉండవు. దీంతో సెల్ ఫోన్‌లను తీసుకెళ్లడం పరిపాటిగా మారింది. ఇక అమ్మవారి దర్శనం తర్వాత రాజగోపురం వద్ద వచ్చే సరికి అక్కడ.. అందరూ సెల్ ఫోన్‌లతో ఫోటోలు దిగుతూ.. కనిపించడంతో భక్తులకు, అధికారులకు తరచుగా గొడవలు జరుగుతుంటాయి.