ప్రభుత్వంతో చర్చలకు వెళ్లకూడదని పీఆర్సీ సాధన సమితి నిర్ణయించింది. విజయవాడలో సమావేశమైన పీఆర్సీ సాధన సమితి నేతలు… ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలా.. వద్దా అన్న అంశంపై చర్చించారు. పీఆర్సీ జీవోలు రద్దు చేసే వరకు చర్చలకు వెళ్లకూడదని నిర్ణయించారు. జీవోలు రద్దు చేయాలని మంత్రుల కమిటీకి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసు కూడా ఇచ్చారు. ఉద్యోగులు ఫిబ్రవరి 6వ తేదీ నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించారు.
ఇక, సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులకు మంత్రుల కమిటీ ఆహ్వానం పంపింది. అయితే, మంత్రుల కమిటీ భేటీకి కూడా వెళ్లబోమని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. పీఆర్సీ జీవోల రద్దుతో పాటు మిశ్రా కమిటీ నివేదికకు బహిర్గతం చేయాలని, పాత పద్ధతిలోనే జీతాలు ఇవ్వాలని, అలా అయితేనే చర్చలకు వెళ్తామని అంటున్నారు.