అమరావతి, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ పండుగైన మహానాడు నిర్వాహణ ఏర్పాట్లపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమీక్షించారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వచ్చే నెల 27, 28 తేదీలలో ఒంగోలులో నిర్వహించనున్న మహానాడు నిర్వాహణకు అవసరమైన ఏర్పాట్లు, కమిటీల నియామకం తదితర అంశాలపై నేతలతో చర్చించారు. 27న నిర్వహించే రెండు తెలుగు రాష్ట్రాల నేతల సమావేశం, 28న నిర్వహించనున్న మహానాడు, ఎన్టీఆర్ శత జయంతోత్సవాలపై నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇటీవల ఒంగోలులో మహానాడు నిర్వాహణ ప్రాంతాన్ని పరిశీలించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆ వివరాలను అధినేతకు వివరించారు.
మహానాడు కమిటీల ఏర్పాటుపై సమీక్షించిన చంద్రబాబు త్వరలోనే కమిటీలను నియమిస్తామని వెల్లడించారు. ట్రాఫిక్ సమస్యలు, అతిథిలకు వసతి సౌకర్యం ఇతర అంశాలపై కూడా చంద్రబాబు నేతలతో మాట్లాడారు. మహానాడుకు భారీగా కార్యకర్తలు, నేతలు తరలివస్తారని దీనికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని నేతలకు సూచించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, డోలా బాల వీరాంజనేయ స్వామి, గద్దె రామ్మోహన్, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, అశోక్‌బాబు, ముఖ్యనేతలు వర్లరామయ్య, టీడీ జనార్థన్ తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..