గుంటూరు : ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాకు ఆ వూళ్ళంటే చచ్చేంత భయం. ప్రపంచంలోనే అత్యధిక భద్రతా ఏర్పాట్లు- వుండే అమెరికా అధ్యక్షుని అధికారనివాసమైన శ్వేతసౌధంలోకి సైతం విజయవంతంగా అడుగుపెట్టగలిగిన కరోనా వైరస్ కి ఆ ఊళ్ళలో కాలుమోపటం సాధ్యం కాలేదు. కరోనాకే సవాల్ విసురుతున్న ఆ ఆరు గ్రామాలు గుంటూరు జిల్లాలో వున్నాయి. అవన్నీ గిరిజనులు అధికంగా నివసించే గ్రామాలే కావటం విశేషం. లాక్‌డౌన్, కర్ఫ్యూల వల్ల ఏం ప్రయోజనం వుంటు-ందని పెదవివిరిచే వారికి ఆ గ్రామాలే సమాధానం. ఆ గ్రామాలన్నీ స్వచ్ఛందంగా స్వీయనియం త్రణ పాటిస్తున్నాయి. గిరిజన గ్రామాలు అనగానే అవి ఎక్కడో మారు మూల అటవీ ప్రాంతాలలో బాహ్యప్రపంచానికి దూరంగా లేవు. జనజీవన శ్రవంతిలోనే అవి మమేకమై వున్నాయి. మిగిలిన గ్రామాల తరహాలోనే ఆయా గ్రామాలలో జనజీవనం కొనసాగుతున్నది. అయి తే గ్రామమంతా ఒకే కట్టు-బాటు-గా వుండి బయటి వ్యక్తులు ఎవర్నీ గ్రామంలోకి అనుమతించకుండా స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. అంతేగాక కరోనా సెకండ్ వేవ్‌లో ప్రజలకు, ప్రభుత్వాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఆక్సిజన్ కొరతకు ఆ గ్రామాలే పరిష్కారం చూపుతున్నాయి. ఎటు- చూసిన భారీ వృక్షాలు వుండి ఆకుపచ్చని రక్షణ కవచంలో వున్నట్టు-ండే ఆ గ్రామాల లో కాలుష్యం అన్నది మచ్చు-కైనా కానరాదు. స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకుంటు-ండటమూ అక్కడి ప్రజల ఆరోగ్య రహస్యంగా చెప్పవచ్చు.
బెల్లంకొండ, బొల్లాపల్లి మండలాలలో..
జిల్లాలో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి వున్న బెల్లంకొండ, బొల్లాపల్లి మండలాల పరిధిలో ఆరు గ్రామాలున్నాయి. బెల్లంకొండ మండల పరిధిలోని గోపాలాపురం (పులిచింతల ముంపు గ్రామం), ఎమ్మాజీ గూడెం, బొల్లాపల్లి మండలంలోని మేకలదిన్నే తండా, దోమలగుండం, గాడి తండా, గంగుపల్లి తండా లలో గత ఏడాది నుంచి ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు సైతం నమోదు కాలేదంటే ఆశ్చర్యం కలుగక మానదు. కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య విషయంలో రాష్ట్రంలోనే తొలి మూడు స్థానాలలో వున్న గుంటూరు జిల్లాలో ఆరు గ్రామాలలో అసలు కరోనా ఆనవాళ్లే లేకపోవటం విశేషం. ఆ గ్రామాలన్నీ 500 నుంచి 800 జనాభా కలిగి వున్నాయి. ఆ గ్రామాల మీదుగా ఆర్టీసీ బస్సు సైతం వెళ్తుంది. కానీ ఆ గ్రామాలలో ఎవరూ బస్సు ఎక్కరు. దిగరు.
గ్రామస్తులు అందరూ స్వీయరక్షణ పాటిస్తున్నారు అంటే అందరూ ఇళ్లకే పరిమితం అయి వుంటారని కూడా కాదు. ఆయా గ్రామాలలో ప్రతి ఒక్కరూ కాయాకష్టం చేసుకునేందుకు ప్రతిరోజూ కూలీపనులకు వెళ్ళి వస్తుంటారు. అయితే అందుకోసం వాహనాలలో ప్రయాణం చేయకుండా కాలినడకన వెళ్లగలిగే పరిధిలోనే మిరప కోతలకు వెళ్ళటం తో పాటు- ప్రభుత్వం కల్పించే ఉపాధి హామీ పనులలో పాల్గొంటు-న్నారు. వాటిద్వారానే వారంతా జీవనోపాధి పొందుతున్నారు. అత్యవసరమైతే తప్ప నిత్యావసర వస్తువులు సైతం కనిష్టం గానే వినియోగిస్తున్నారు. ఆయా గ్రామాలకు సమీపంలోనే ఆరోగ్యశాఖ ఏర్పాటు- చేసిన ప్రాథమిక వైద్య ఆరోగ్యకేంద్రాలు వున్నప్పటికి ఏనాడూ వాటికి వెళ్ళిన దాఖలాలు లేవు. తీవ్ర అనారోగ్యం సంభవిస్తే గోపాలాపురం, ఎమ్మాజీగూడెం వాసులు బెల్లంకొండకు, బొల్లాపల్లి మండల పరిధిలోని నాలుగు తండాల వారు దుర్గి, కారంపూడి వరకు వెళ్ళి చికిత్స చేయించుకోవటం జరుగుతుంది. ఇతర కారణాలతో అనారోగ్యానికి గురయ్యే వారు సైతం కేవలం వేళ్లమీద లెక్కబెట్టగలిగినంత మంది మాత్రమే వుంటారు. కరోనా మొదటి వేవ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు బొల్లాపల్లి మండలం మొత్తం మీద కేవలం 329 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. కరోనా కారణంగా మండలం మొత్తం మీద కేవలం నలుగురే మరణించారు. దీన్ని బట్టి వారిలో రోగనిరోధక శక్తి ఏ స్థాయిలో వున్నదో అర్థమవుతుంది.
జీవన విధానమే రక్ష
తండావాసుల జీవన విధానాలే వారికి రక్షగా నిలుస్తున్నాయన టంలో సందేహం లేదు. ఏ విధమైన ఆందోళనలు, వత్తిడులు లేని ప్రశాంత జీవనం, కాలుష్య రహిత వాతావరణం, స్వచ్చమైన భూగర్భ జలాల వినియోగం, శారీరక శ్రమ వంటి వాటితో పాటు- ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటించ టం వంటి చర్యల కారణంగా కరోనా వారి దరిచేరలేదు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా వున్న ప్రాంతాలలో పరిస్థితులు గమనిస్తే గిరిజన తండాల తరహాలో జీవన విధానం లేకపోవటమే ప్రధాన కారణం అని స్పష్టం అవుతున్నది. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు విధించినా, మార్గదర్శకాలు నిర్దేశించినా పట్టణాలలోనే కాదు, కొన్ని పెద్ద గ్రామాలలో సైతం యధేచ్చగా జనసంచారం కానవస్తోంది. ఈ విధమైన నిర్లక్ష్య ధోరణి కరోనా వ్యాప్తికి దోహదకారి అవుతున్నదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.