Tuesday, November 26, 2024

కేంద్ర ఉద్యోగాల ప్రకటనే లేదు.. ప్రైవేటీకరణకు వ్యతిరేకం: వైసీపీ ఎంపీలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బూస్టర్ వ్యాక్సిన్‌లా ఉంటుందనుకున్న బడ్జెట్ నిరుత్సాహపరిచిందని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ భవన్‌లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్‌లో తమ పార్టీ ఎంపీలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. బడ్జెట్ చూడడానికి స్టైల్‌గా ఉందే గానీ అందులో ఏమీ లేదన్నారు. కేంద్రం సబ్‌కా వికాస్ అంటున్నా రాష్ట్రాల మీద ఫోకస్ మాత్రం కనిపించట్లేదని విజయసాయి ఆరోపించారు. 9.2 శాతం వృద్ధి రేటు అభినందనీయమన్నారు. కేంద్రం ఎఫ్ఆర్‌బీఎం పరిమితి అయితే దాటవచ్చు గానీ రాష్ట్రాలు దాటనకూడదన్న ద్వంద్వ విధానాలు సరికాదని చెప్పుకొచ్చారు. రాష్ట్రాలకు మూలధన వ్యయం కింద లక్ష కోట్లు ఇస్తామనడం స్వాగతించదగిన విషయమే అయినా అందులో ఏపీకి వచ్చేది నాలుగు వేల కోట్లు మాత్రమేనని ఆయన వివరించారు.

ఏపీతో పోలిస్తే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఎక్కువ నిధులు వెళతాయని, కేంద్రం విధించిన రేషియో వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని విజయసాయి ఆందోళన వ్యక్తం చేశారు. నదుల అనుసంధాన్ని స్వాగతించిన ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సొంత ఖర్చులతో కృష్ణా, గోదావరి అనుసంధానం పూర్తి చేసిందని గుర్తు చేశారు. గోదావరి-పెన్నా పనులూ పూర్తయ్యాయని చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను తిరిగివ్వాలని కేంద్రాన్ని కోరతామని ఆయన తెలిపారు. ఆరోగ్య పరికరాలను మెరుగుపరుచుకునేందుకు నిధులు లేవని, ఉపాధి హామీ పథకానికీ కేటాయింపులు పెంచలేదని ఆరోపించారు. కేంద్రం వద్ద 8 లక్షల ఉద్యోగాలు ఉన్నా వాటి ప్రకటనే లేదని, జీఎస్టీ పరిహారం మరో ఐదేళ్ల పొడిగింపు, పంటలకు మద్దతు ధర చట్టబద్దత గురించి ప్రస్తావనా లేదని విజయసాయి విమర్శించారు.

భూమి లేని రైతుల కోసం పథకం తీసుకురావాలని ఎంపీ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఏపీ సీఎం ఇచ్చిన 10 అంశాలపై కమిటీ చర్చ జరుపుతోందని, రాష్ట్ర విజ్ఞప్తులపై సానుకూల నిర్ణయాలు వస్తాయని భావిస్తున్నామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని ఆయన స్పష్టం చేశారు. 13వ షెడ్యూల్ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామని వెల్లడించారు. వన్ నేషన్ – వన్ రిజిస్ట్రేషన్‌పై కేంద్రం అన్ని రాష్ట్రాలను సంప్రదించి చట్టం తీసుకువచ్చాకే ముందుకు వెళ్లాల్సి ఉంటుందని విజయసాయి తేల్చి చెప్పారు. క్రిప్టో కరెన్సీపై కేంద్రం మంచి నిర్ణయం తీసుకుందన్నారు. భారత్‌లో డిజిటల్ కరెన్సీని బిల్లు రూపంలోనే తీసుకురావాలని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement