Thursday, November 21, 2024

18 వరకు ఎలాంటి చర్యలొద్దు.. నారాయణ కుమార్తె, అల్లుడు ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై విచారణ

అమరావతి, ఆంధ్రప్రభ : పదవ తరగతి ప్రశ్నాపత్రం మాల్‌ ప్రాక్టీస్‌ కేసులో పోలీసులు తమను అరెస్ట్‌ చేసే అవకాశం ఉన్నందున ముందుస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు పొంగూరు సింధూర, పొంగూరు శరణి, అల్లుడు కె.పునీత్‌, నారాయణ మామ రాపూరు కోటేశ్వరరావు, నారాయణ ఎడ్యుకేషనల్‌ సొసైటీ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ జె.కొండలరావు, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ మాలేపాటి కిషోర్‌, సొసైటీ సభ్యులు వీపీఎస్‌ఆర్‌ ప్రసాద్‌, మరో ఆరుగురు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. హౌస్‌ మోషన్‌ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్‌ కుంభజడల మన్మధరావు విచారణ చేపట్టారు. రెండు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్ల విషయంలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేశారు. అంతకు ముందు పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ పదవ తరగతి ప్రశ్నాపత్రం మాల్‌ ప్రాక్టీస్‌కు సంబంధించి చిత్తూరు వన్‌ టౌన్‌ పోలీసులు ఏప్రిల్‌ 27న కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇతరులకు ఇప్పటికే కింది కోర్టు బెయిల్‌ మంజూరు చేసిందని తెలిపారు.

పిటిషనర్లు ఆ కేసులో నిందితులు కానప్పటికీ..నారాయణ విద్యా సంస్థల్లో వారు బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో అరెస్ట్‌ చేసే అవకాశం ఉందన్నారు. అందువల్లనే ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్లు దాఖలు చేసినట్టు తెలిపారు. పోలీసుల తరఫున అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శెట్టిపల్లి దుష్యంత్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ కేసులో పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామనీ.. విచారణను సోమవారానికి వాయిదా వేయాలని కోరారు. పిటిషనర్లు నిందితులు కానప్పుడు వారికి ఏ ప్రాతిపదికన కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయగలదన్నారు. పిటిషనర్లు నిందితులు కానప్పుడు వారికి కొంత రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం వల్ల అభ్యంతరం ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ మేరకు ఈ నెల 18వ తేదీ వరకు పిటిషనర్ల విషయంలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. కేసు పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement