చంద్రగిరి ( రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో ) : రాష్ట్రం కోసం, ప్రజల కోసం రాత్రింబవళ్ళు ఆలోచించే చంద్రబాబు ను అక్రమంగా నిర్భందించడం అంటే రాష్ట్రాన్ని, న్యాయన్ని నిర్భందించడమే అని నారా భువనేశ్వరి అన్నారు. ఆమె చంద్రబాబు అరెస్టు ను నిరసిస్తూ చంద్రగిరి మండలంలో ఈ రోజు నిజం గెలవాలి అనే పేరుతో బస్సు యాత్ర చేపట్టారు. ఆ యాత్రలో భాగంగా ఆగరాల వద్ద సాయంత్రం జరిగిన సభలో మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్రం, ప్రజల తరువాతే కుటుంబం అని భావించి పనిచేసేవారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అయినా, విభజిత ఆంధ్రప్రదేశ్ లో అయినా ఆ కోణంలో నే అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళేవారన్నారు.
భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని చేసే మంచి పనుల పై విమర్శలు వచ్చినప్పుడు తాను కూడా ఎందుకని అడిగేదాన్నని చెబుతూ తన ఆలోచనలు రేపటి గురించే అని చెప్పేవారన్నారు. ఆ క్రమంలోనే హైదరాబాద్ హై టెక్ సిటీ వంటి ఫలితాలు అందరూ చూస్తున్నారన్నారు. అటువంటి నిజాయితీ పరుడైన ప్రజా నాయకుడిని ఎటువంటి ఆధారాలు లేకుండా స్కిల్, ఔటర్ రింగ్ రోడ్డు, సైబర్ నెట్ అనే కేసుల్లో 45 రోజులుగా నిర్భందించారని ఆరోపించారు. ఆయన్ని నిర్భందించడం అంటే న్యాయాన్ని, రాష్ట్రాన్ని నిర్భందించడమే అన్నారు. ఇటువంటి పాలకులపై ఎన్ టి ఆర్ ఇచ్చిన తెలుగువారి పౌరుషం తో బ్రిటష్ వారిపై పోరాడిన విధంగా పోరాడాలని పిలుపు ఇచ్చారు. నిజం గెలవాలని చాటి చెప్పాలన్నారు.