మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురైన స్థలంలో లభించిన లేఖపై వేలిముద్రలను గుర్తించేందుకు నిన్‌హైడ్రేట్ పరీక్ష జరిపించాలని నిర్ణయించింది. ఇందుకోసం సీబీఐ అధికారులు.. సీబీఐ కోర్టు అనుమతి కోరారు. వివరాలు.. 2019 మార్చి 15న పులివెందులలోని తన సొంత నివాసంలో వైఎస్ వివేకా హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే వివేకా హత్య స్థలంలో వివేకానందరెడ్డి రాసినట్టుగా చెబుతున్న లేఖ లభించింది.
అయితే ఈ లేఖను సీబీఐ 2021 ఫిబ్రవరి 11న ఢిల్లీలోని సీఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపింది. అయితే పరీక్షల అనంతరం వివేకా ఒత్తిడిలో లేఖ రాసినట్టుగా సీఎఫ్‌ఎస్‌ఎల్ తేల్చింది. తాజాగా ఈ లేఖపై వేలిముద్రలను సేకరించేందుకు సీబీఐ సిద్దమైంది. ఈ క్రమంలోనే లేఖపై ఉన్న వేలిముద్రలు కూడా గుర్తించాలని సీఎఫ్ఎస్‌ఎల్‌ను సీబీఐ కోరింది. లేఖపై వేలిముద్రల గుర్తింపునకు నిన్‌హైడ్రేట్ పరీక్ష చేయాలని సీఎఫ్‌ఎస్‌ఎల్ సూచించింది. పరీక్ష ద్వారా లేఖపై రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉందని తెలిపింది.
ఈ నేపథ్యంలో నేసీబీఐ అధికారులు సీబీఐ కోర్టును ఆశ్రయించారు. వివేకా హత్య స్థలంలో లభించిన లేఖపై నిన్‌హైడ్రేట్ పరీక్షకు అనుమతివ్వాలని కోరారు. లేఖపై వేలిముద్రలను అనుమానితుల వేలిముద్రలతో పోల్చాల్సి ఉందని తెలిపారు. లేఖపై రాత, ఇంకు దెబ్బతింటే.. రికార్డుల్లో ఒరిజినల్ లేఖ బదులుగా కలర్ జిరాక్స్‌ను అనుమతించాలని కూడా కోరారు.
ఇక, అయితే సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు నిందితుల స్పందన కోరింది. ఇక, సీబీఐ పిటిషన్‌పై సీబీఐ కోర్టు జూన్ 2వ తేదీన విచారణ చేపట్టనుంది. ఇదిలా ఉంటే.. ఈ లేఖ గురించే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధానంగా ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల సీబీఐ అధికారులు ఈ లేఖకు సంబంధించి వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి, వంట మనిషి కొడుకును విచారించిన సంగతి తెలిసిందే.