అమరావతి, ఆంధ్రప్రభ:రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వచ్చే వారం పోలవరంలో పర్యటించనున్నట్టు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో పాటు ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశమై సీఎం పర్యటన సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు.
పోలవరం పర్యటన సందర్భంగా సీఎం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి -టైం షెడ్యూల్ ను కూడా విడుదల చేయనున్నట్టు ఈ సందర్భంగా వెల్లడించారు. జనవరి నుంచి డయా ఫ్రం వాల్ పనులు ప్రారంభం కానున్నాయి. డయాఫ్రం వాల్ నిర్మాణంతో పాటు సమాంతరంగా ఎర్త్ కం రాక్ ఫిల్లింగ్ (ఈసీఆర్‌ఎఫ్) పనులు కూడా చేపట్టాల్సి ఉంది. త్వరలోనే సహాయ, పునరావాసం (ఆర్‌అండ్‌ఆర్)తో పాటు భూసేకరణ పనులు కూడా పున:ప్రారంభించి వేగవంతం చేయాలి. షెడ్యూల్ ప్రకారం ఒక్క గంట కూడా వృధా కాకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేలా పక్కా ప్రణాళిక రూపొందించాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి నిమ్మల దిశా నిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం. వెంకటేశ్వరావు, పోలవరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ నరసింహ మూర్తి లతో పాటు కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.