కొత్త ఏడాది తొలి రోజున ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 25 గంటల కౌంట్‌డౌన్ అనంతరం నిప్పులను వెదజల్లుతూ రాకెట్ నింగిలోకి విజయవంతంగా వెళ్లింది. దీంతో ఈ ఏడాది ఇస్రోకు శుభారంభం లభించింది. ఉదయం 9:10 గంటలకు పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్ నింగిలోకి ప్రవేశించింది.
ఈ పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్ ద్వారా 480 కిలోల ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని (ఎక్స్‌పోశాట్) నింగిలోకి పంపించారు. ఈ ఎక్స్పో శాట్‌తోపాటు కేరళ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన విమెన్ ఇంజినీర్డ్ శాటిలైట్ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. ఎక్స్‌పోశాట్‌తోపాటు మొత్తం పది బుల్లి ఉపగ్రహాలను కూడా భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు
ఎక్స్‌రే మూలాలను అన్వేషించడమే లక్ష్యంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు.ఎక్స్-రే పోలారిమెట్రీ ఉపగ్రహాన్ని ఇది అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. ఇమేజింగ్, టైం డొమైన్ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కోపీపై దృష్టి సారించి.. మునుపటి మిషన్ల మాదిరిగా కాకుండా.. ఎక్స్-రే మూలాలను అన్వేషించనుంది ఎక్స్ పోశాట్..