ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న ఎర్రగంగిరెడ్డి.. వివేకా ఇంటి వాచ్‌మెన్‌గా ఉన్న రంగయ్య చేసిన ఆరోపణలపై స్పందించారు. రంగన్నతో తనకు పరిచయమే లేదని, తానెవరినీ బెదిరించలేదని తెలిపారు. తాను బెదిరించినట్లు కడప, పులివెందులలో ఎక్కడా కేసులు లేవన్నారు. వివేకాకు తాను ద్రోహం చేసే వ్యక్తిని కాదని.. వివేకా హత్య కేసులో తనకు ప్రమేయం లేదని ఎర్రగంగిరెడ్డి స్పష్టం చేశారు.
అయితే, రంగయ్య మాత్రం దీనిని ఖండించారు. వివేకా హత్యకు ముందు అర్ధరాత్రి ఎవరో కొందరు ఇంట్లోకి వచ్చారని చెప్పారు. వాళ్లు ఎవరో తనకు తెలియదన్నారు. ఎర్ర గంగిరెడ్డి వివేకాతోనే ఉంటారని, తనతో ఎన్నోసార్లు మాట్లాడారని చెప్పారు. ఇప్పుడు తానెవరో తెలియదంటే ఏమనుకోవాలిని రంగయ్య ప్రశ్నించారు.
కర్నూలు జిల్లా అవుకు మండలం కాశీపురానికి చెందిన రంగయ్య… 2017 నుంచి వివేకానందరెడ్డి ఇంటికి వాచ్ మెన్ గా ఉన్నారు. వివేకా హత్య జరిగిన 2019 మార్చి 15 రోజున కూడా ఆయనే ఆ ఇంటి కాపలాదారుగా ఉన్నారు. వివేకా బతికి ఉండగా చివరిసారి, చనిపోయాక మొదటిసారి చూసింది ఈయనే. రంగయ్య శుక్రవారం(జులై 23) కడప జిల్లా జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ఈ హత్యలో ఇద్దరు ప్రముఖులు సహా మొత్తం తొమ్మిది మంది ప్రమేయం ఉందని వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోంది.
వివేకా హత్య కేసును ఏడాది జూన్ 6 నుంచి డీఐజీ సుధాసింగ్ నేతృత్వంలో సీబీఐ బృందం కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్‌లో రెండో విడత విచారణ చేపట్టింది. పలు దఫాలు దాదాపు 35-40 మందిని ప్రశ్నించారు. వీరిలో వాచ్‌మన్ రంగయ్యతో పాటు వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లా, మాజీ డ్రైవర్ దస్తగిరి, పులివెందులకు చెందిన వైసీపీ నేత కిరణ్‌కుమార్ యాదవ్, తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండిః 40 మంది సలహాదారులు అవసరమా?: ఏపీ సర్కార్‌కి హైకోర్టు ప్రశ్న