తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబుకు ఎట్టకేలకు జైలు జీవితం నుంచి తాత్కాలిక విముక్తి లభించింది. అనారోగ్య పరిస్థితిలో వైద్య సాయం కోసం ఏపీ హైకోర్టు ఆయన దాఖలు చేసిన పిటీషన్పై న్యాయమూర్తి స్పందించారు. నవంబర్ 24 వరకూ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి తల్లాప్రగడ మల్లిఖార్జున రావు మంగళవారం ఉదయం తీర్పునిచ్చారు. గత 53 రోజులు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండు ఖైదీ జీవితం అనుభవించిన నారా చంద్రబాబు నాయుడు … జైలు నుంచి బయటకు రావటం ఖాయమైంది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు ఈ బెయిల్ అమలులో ఉంటుంది. అనారోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థిస్తూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీని పైన వాదనల అనంతరం హై కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. దీంతో, 53 రోజుల రిమాండ్ తరువాత చంద్రబాబు కు ఊరట లభించింది.
అనుబంధ పిటిషన్పై వెల్లడించే నిర్ణయం ఆధారంగా.. ప్రధాన బెయిల్ పిటిషన్పై విచారణ ఉంటుందని స్పష్టం చేశారు. స్కిల్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. తర్వాత ఆనారోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థిస్తూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు సోమవారం విచారణకు రాగా.. సీఐడీ తరఫున ప్రత్యేక ప్రబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద స్పందిస్తూ.. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా చంద్రబాబుకు మెడికల్ రిపోర్టులను న్యాయస్థానం ముందు ఉంచామని తెలిపారు. టీడీపీ అధినేత తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు.
వైసీపీ ప్రభుత్వం ప్రతీకార చర్యల్లో భాగంగానే చంద్రబాబును స్కిల్ స్కామ్ కేసులో నిందితుడిగా చేర్చిందని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. 17ఏ ప్రపవిషయంలో వాదనలు మగియడంతో సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వు చేసిన విషయాన్ని కోర్టుకు వివరించారు. స్కిల్ డెవల్పమెంట్ కార్పొరేసన్ ఏర్పాటు చంద్రబాబు ఒక్కరే తీసుకున్న నిర్ణయం కాదని వివరించారు. ఇందుకు కేబినెట్ ఆమోదం ఉందన్నారు. ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం, సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగిందని కోర్టుకు నివేదించారు. ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో చంద్రబాబుపై నిర్దిష్టమైన ఆరోపణలు లేవు. డిజైన్ టెక్ సంస్థకు ఎక్వి్పమెంట్ సమకూర్చిన స్కిలర్ సంస్థ ఫేక్ ఇన్వాయిస్ లు సృష్టించిందనే కారణం చూపి అందుకు చంద్రబాబును బాధ్యుడిని చేయడం సరికాదని వాదించారు. చంద్రబాబు గత 52 రోజులుగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని కోర్టుకు వివరించారు. చంద్రబాబు దాదాపు 5 కేజీల బరువు తగ్గారని, వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కోర్టుకు నివేదించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన ఉందని చెప్పారు. పలు వైద్య పరీక్షలు చేయాలని ప్రభుత్వ డాక్టర్లు సిఫారసు చేశారని వివరించారు.అత్యవసరంగా కంటికి శస్త్రచికిత్స చేయాలని పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్లో ఎడమ కంటిలో శుక్లానికి శస్త్ర చికిత్స చేశారని వెల్లడించారు. మూడునెలల్లో కుడి కంటికీ ఆపరేషన్ చేయాలని వైద్యులు నివేదిక ఇచ్చారని డిఫెన్స్ న్యాయవాదులు వివరించారు. . ప్రస్తుతం కుడి కన్ను చూపు మందగించిందని… అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించాలని కోర్టుకు నివేదించారు. తనకు నచ్చిన డాక్టర్ వద్ద వైద్యం చేయించుకునే హక్కు చంద్రబాబుకు ఉందని వాదనల్లో పేర్కొన్నారు. సీఐడీ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి తన వాదనలో ప్రధాన బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని కోరారు. దీని పైన ఈ రోజన న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ..తదుపరి నవంబర్ 24కు వాయిదా వేసింది.
హైకోర్టు షరతులు
స్కిల్ స్కామ్ కేసులో నిందితుడు చంద్రబాబునాయుడుకు పలు షరతులతో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
రూ.1 లక్ష పూచీకత్తు, 2 షూరిటీలు సమర్పించాలని, చంద్రబాబుకు కుడి కంటికి కాటరాక్ట్ సర్జరీ కోసం ఈ మధ్యంతర బెయిల్ ఇస్తున్నామనిచ ఇదే సమయంలో చంద్రబాబు బెయిల్ సమయంలో ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన కూడదు. కేసులో సాక్షులను ప్రభావితం చేయకూడదు.
మరో కేసు రెడీ …
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చినా.. రాష్ర్ట ప్రభుత్వం వేటకు బ్రేకులు లేవు. మద్యం కేసుతో చంద్రబాబును మళ్ళీ జైలుకు పంపించే ఏర్పాట్లు చేసింది. మద్యం కంపెనీలకు అనుమతి ఇచ్చిన కేసులో చంద్రబాబు ఏ 3 కాగా.. అతడిని అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని సీఐడీ హైకోర్టులో పిటీషన్ వేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు నాయుడూ పిటీషన్ వేశారు. ఈ కేసు విచారణను హైకోర్టు స్వీకరించింది. లంచ్ మోషన్లో విచారణ జరుపుతుంది. చంద్రబాబుపై మరిన్ని కేసులు ఉన్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఫైబర్ గ్రిడ్ కేసు సుప్రీం లో పెండింగ్ లో ఉంది.
టీడీపీలో హర్షం.. టెన్షన్
చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంతో టీడీపీ శ్రేణు ల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్ 9న నంద్యాలలో సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 10 న ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం 10 అర్ధరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు గత 53 రోజులుగా టీడీపీ అధినేత రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. మరో కేసులో అరెస్టు చేయటానికి సీఐడీ సిద్దం కావటంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. తీవ్ర ఉత్కంఠతో హైకోర్టు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.
కాగా బెయిల్ పూచికత్తులు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరావు సమర్పించారు.. దీంతో నేటి సాయంత్రం చంద్రబాబు విడుదల కావచ్చని భావిస్తున్నారు.