అమరావతి, ఆంధ్రప్రభ: వేతన సవరణ ఉత్తర్వులు అమలు చేసి కొత్త జీతాలు చెల్లించాలని పీటీడీ(ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పదకొండు ప్రధాన సమస్యలను పరిష్కరించాలంటూ ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావుకు లేఖ అందజేసినట్లు ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు, కో-కన్వీనర్లు సీహెచ్ సుందరయ్య, వైఎస్ రావు, జేఏసీ నేతలు, ఎన్ఎంయూఎ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి, ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు తెలిపారు. గతంలో ఐక్యవేదిక నేతలు ఉద్యోగుల సమస్య పరిస్కారానికి ఉన్నత సమావేశం ఏర్పాటు చేయాలని కోరగా ఇచ్చిన హామీని విస్మరించిన ఎండీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీనిపై మంగళవారం ఆర్టీసీ జేఏసీ అత్యవసర ఆన్లైన్ సమావేశం నిర్వహించి గత సమస్యలతో పాటు ప్రస్తుత సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహణకు డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు.
కొత్త జీతాలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి రెండు నెలలు గడిచినా కొత్త వేతనాలు ఇవ్వడం లేదని లేఖలో తెలిపారు. వెంటనే ఆ జీవోలు అమలు చేయాలని వారు పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు గతంలో ఉన్న అన్ని అలవెన్సులు పునరుద్దరించాలని, ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ-లలో ఒకదానిని పునరుద్దరించాలని కోరినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్గో అభివృద్ధికి ఉద్యోగులకు విధిస్తున్న టార్గెట్లు ఉప సంహరించుకోవాలని, ఉద్యోగులతో ఎలాంటి చర్చలు జరపకుండా ఏకపక్షంగా సెటిల్ మెంట్ చేయటం అభ్యంతరకరమన్నారు. అన్ని స్థాయిల్లో పారదర్శకంగా బదిలీ విధానం అమలు చేయాలనే తదితర డిమాండ్లతో కూడిన లేఖను అందజేశామని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జేఏసీ సమక్షంలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేయని పక్షంలో తిరిగి ఉద్యమం చేసే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా ఐక్య వేదిక నేతలు హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.