Wednesday, November 20, 2024

New Record – ఎవ‌రెస్ట్‌పై.. హ‌నుమంతుడు!వృత్తి వైద్యం.. ప్ర‌వృత్తి పర్వతారోహణం

నీలాకాశంలో… తెల్లటి మబ్బుల చుంబనంలో.. మెరిసి పోయే హిమాలయాల సౌందర్యం వర్ణనాతీం. అద్బుతం… అనన్యం. ఆ అనుభూతి అనిర్వచనీయం. ఈ సప్తవర్ణ ఇంద్ర ధనస్సులో.. ఆధిత్యుడి వెలుగులో మెరిసే ఆ కొండల్లో.. మంచు దుప్పట్ల కనువిందులో తనువు పులకరించాల్సిందే. మురిసి పోవాల్సిందే. మైమరసి పోవాల్సిందే. ఈ ప్రమోద లయలో.. అమ్మో.. ప్రమాద లోయలూ పలకరిస్తుంటాయి సుమీ. ఓ వైపు చలి పులి దాడి. గజగజ వణుకుడే కాదు.. రక్తాన్ని గడ్డకట్టించే శీతల రక్కసి జుర్రులాట. ఇవీ హిమాలయాల్లో భీకర భయానక అనుభవాలు. ఆ కొండను ఎక్కాలంటే.. ప్రాణాలను పణంగా పెట్టినట్టే. శిఖరాన్ని చేరేలోపునే ఊపిరి సలపదు. అటు అందచందాల మంచు తెరల గిలిగింతలు.. ఇటు మృత్యువు గాఢ కౌగిలి కేరింతలలోనూ.. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా.. హిమాలయాలను, హిమానీనదాలను కాపాడే క్రతువులో.. ఓ మూడు తరాల కుటుంబం .. ఆ వెండి శిఖరంపై కదం తొక్కింది. భరత జాతి ఖ్యాతిని ఎగురవేసింది. హార్వార్డ్ వరల్డ్ రికార్డ్ , వరల్ రికార్డ్ బుక్ పేజీల్లో కొత్త చరిత్రను సృష్టించింది.

నూజివీడు, ఏలూరు జిల్లా (ప్రభన్యూస్): వశుదైక కుటుంబానికి మంచి జరగాలి. అందరూ బాగుండాలి. అందరిలో మనం ఉండాలి. ఈ భూమిని పీడిస్తున్న కాలుష్య భూతాన్ని తరిమికొట్టాలి. పంచభూతాల పరిరక్షణకు అందరం నడుము కట్టాలి, అనే ధ్యేయంతో.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, హిమనీనదాలను కాపాడుకుందాం అనే నినాదంతో మూడు తరాల కుటుంబం చైతన్య కత్రువును చేపట్టింది. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో ప్రముఖ చిన్న పిల్లల డాక్ట‌ర్‌ హనుమంతరావు చౌదరి, గుండె వైద్య నిపుణులు రాఘవరావు ప్రపంచంలో అత్యంత ఎతైన పర్వతం ఎవరెస్ట్ శిఖిరం బేస్ కేంప్ అధిరోహించి గాంధీజయంతి రోజున భారతదేశ మువ్వన్నెల జాతీయ జెండాను, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సెంటెనరీ జెండాను, ఆంధ్ర వైద్య కళాశాల జెండాలను ఆవిష్కరించారు.

ఇందులో హిమాలయ ట్రెక్ లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిష్టించి మూడు తరాల కుటుంబసభ్యులు డాక్టర్ హనుమంతరావు చౌదరి (67) , కుమార్తె, కంటి వైద్యురాలు డాక్టర్ తుమ్మల శ్రావణ సంధ్య (40) మనువడు నరేన్ వెంగయ్య చౌదరి (13) నయా చరిత్రను సృష్టించటం విశేషం. ప్రపంచంలోనే ‘స్టాప్ గోబల్ వార్మింగ్ బై ఫస్ ఫ్యామిలీ ఆఫ్ త్రీ జనరేషన్స్’ నినాదంతో హిమాలయాల్లో తమ సత్తాను ఈ మూడు తరాల కుటుంబ సభ్యులు చాటారు. ‘హార్వార్డ్ వరల్డ్ రికార్డ్”వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్’లో స్థానం సాధించారు. 74 ఏళ్ల ప్రాయంలో ఎవరెస్ట్ బేస్ కేంప్ అధిరోహించిన తొలి వ్యక్తిగా డాక్టర్ . రాఘవరావు హార్వార్డ్ వరల్డ్ రికార్డును నెలకొల్పారు.

పర్వతారోహణపై ప్రత్యేక శిక్షణ

ప్రపంచంలోకెల్లా ఎతైన పర్వతంగా ఎవరెస్ట్ ను పరిగణిస్తారు.ఇది సముద్ర మట్టానికి29,028 అడుగుల ఎత్తులో ఉంది.ఎవరెస్టు బేస్ కేంప్ అధిరోహణ ఆలోచనతో అక్కడి వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేలా శారీరకంగా, మానసికంగా బలంగా ఉండేందుకు మూడు నెలల పాటు ఈ త్రయోతర కుటుంబానికి గుండె వ్యాధి నిపుణులు కార్డియాలజిస్ట్ డాక్టర్ రాఘవరావు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్టు డాక్టర్ హనుమంతరావు చౌదరి తెలిపారు. ఈ అద్భుత సాహస యాత్రలో సహచర సభ్యులు అమెరికా టెక్సాస్ పార్లమెంట్ సభ్యులు, సల్మాన్ భోజానీ ప్రశంసలు అందుకున్నారు.

- Advertisement -

ఆద్యంతం అత్యంత సాహసం

ఎవరెస్టు శిఖర బేస్ క్యాంప్ ను అధిరోహించటం అంటే సాధారణ అంశం కాదు. అత్యంత సాహాసోపేత యాత్ర. భయంకర చలిలో ఈ మంచు ఎడారిని తలపించే ఈ బేస్ క్యాంప్ లో ఆక్సీజన్ స్థాయి 50 శాతమే. ఉష్ణోగ్రత మైనస్ 16సెల్సియస్ డిగ్రీలే. గడ్డకట్టిన మంచులో తడబడక నిలబడి నడక సాగించటం సామాన్యులకు అసాధ్యం. కానీ డార్జిలింగ్ హిమాలయన్ మౌంటెనిరింగ్ ఐన్సిట్యూట్ లో టెన్సింగ్ నార్వే ఆధ్వర్యంలో పర్వతారోహణ కోర్స్ లో శిక్షణ అనుభవం, లడాక్ లోచలిలో గడ్డ కట్టిన జంస్కార్ నదిలో చదర్ ట్రెక్, ఉత్తరాఖండ్ లో గంగోత్రి గోముఖ్ ట్రెక్, వేలీ ఆఫ్ ఫ్లవర్స్, హిమ కుండ్ సాహెబ్ ట్రెక్ లో అనుభవంతో డాక్టర్ హనుమంతరావు చౌదరికి ఎవరెస్ట్ పర్వతారోహణ సాధ్యమైందంటే అతిశయోక్తి కాదు.

ఇలా బేస్ క్యాంప్ చేరిక….

ఐదుగురు ఒక బృందంగా ఏర్పడి ఖాట్మాండు ఎయిర్ పోర్ట్ నుంచి నేపాల్ లోని అతి ప్రమాదకర లుక్లా విమానాశ్రయం చేరుకున్నారు. సాగరమాత నేషనల్ పార్క్ ను సందర్శించారు. అక్కడి నుంచి 130 కిలోమీటర్లు నడిచారు. ఎనిమిది రోజులలో 17,800 అడుగుల ఎత్తులోని బేస్ క్యాంప్ నకు చేరారు. స్నానపానాదులూ కష్టమే. మధ్యమధ్యలో దాహం తీర్చుకుంటూ నడక సాగించినట్టు తుమ్మల శ్రావణ సంధ్య తెలిపారు. ఈ పర్వతారోహణంలో ఎంతో ఉత్సాహం, ప్రకృతిలో మమేకం కాంటంతో అత్యంత విలువైన అనుభవం లభించిందని . విజయవాడ బ్లూమింగ్డేల్ పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న తుమ్మల నరేన్ వెంగయ్య చౌదరి తెలిపారు.

సాహస యాత్రలో.. ఓ అపశృతి

ఎవరెస్టు పర్వతారోహనం అత్యంత ప్రమాదకరం. రక్తంలో ఆక్సిజన్ స్థాయి పడిపోతుంది. తలనొప్పి,వికారం,ఆకలి తగ్గిపోతాయి. ఎక్యూట్ మౌంటెన్ సిక్నెస్ అనే తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. ఇలాంటి స్థితిలో పర్వతారోహకులు తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు డాక్టర్ రాఘవరావు సూచించారు. అమెరికాకు చెందిన ఒక పర్వతా రోహకుడు ఒకరు చాలా ప్రమాదకర స్థితికి చేరగా.. తక్షణమే ప్రాధమిక చికిత్స అందించి అమెరికా లోని ఇన్సూరెన్స్ కంపెనీని ఒప్పించి హెలికాప్టర్ లో పంపించి.. అతడి ప్రాణాలను కాపాడటంపై ఎంతో సంతృప్తి కలిగిందని డాక్టర్ రాఘవరావు తెలిపారు. మార్గమధ్యంలో ఎన్నో వ్యయప్రయాసలతో సాగిన మా నడక బేస్ క్యాంప్ కు చేరుకోగానే భావోద్వేగాలతో పులకించిపోయి,మరచిపోని మధురానుభూతిని పొందామని బృంద సభ్యులు తమ ఆనంద క్షణాలను పంచుకున్నారు..

వారి స‌హ‌కారం మ‌రువ‌లేనిది..
ఆ మధుర క్షణాలను మాకు అందించిన బూట్స్ అండ్ క్రేంపన్స్ కంపెనీ అధినేత, ఎవరెస్ట్ శిఖరాన్ని ఎన్నోసార్లు అథిరోహించిన భరత్ తమ్మినేని.. వారి టీమ్ నకు మా కృతజ్ఞతలు. ఎవరెస్టు బేస్ క్యాంప్ వద్దకు చేరుకోవాలంటే ఒక్కొక్కరికి షుమారు లక్ష వరకు ఖర్చవుతుందని వివరించారు డా. హనుమంతురావు. ‘ స్టాప్ గ్లోబల్ వార్మింగ్ అండ్ లెట్ ది హిమాలయాస్ లివ్’ అనే నినాదంతో ప్రపంచం లో మొదటిసారి ఎవరెస్టు బేస్ క్యాంప్ ట్రెక్ విజయవంతంగా పూర్తి చేసిన ‘ఫస్ట్ ఫ్యామిలీ ఆఫ్ త్రీ జనరేషన్స్’ అయిన డాక్టర్ హనుమంతరావు చౌదరి కుటుంబసభ్యులకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, లండన్ ప్రతినిధులు కూడ ప్రశంశా పత్రాలను అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement