Monday, November 25, 2024

Breaking: రామతీర్థంలో నూతన రామాలయం.. శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్టాపన

విజయనగరం జిల్లా రామతీర్ధంలో తూతన రామాలయం ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. శాస్త్రోక్తంగా విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే, విగ్రహ ప్రతిష్టాపనకు అశోక్ గజపతిరాజు హాజరుకాలేదు. పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ కోదండ రామస్వామి ఆలయ పునర్నిర్మాణం కేవలం నాలుగు నెలల్లో పూర్తయింది. ఇక్కడి బోడికొండపై పాత ఆలయం ఉన్నచోటే రూ.3 కోట్ల ఖర్చుతో నూతన హంగులతో కొత్త రాతి దేవాలయం పునర్నిర్మాణానికి 2021 డిసెంబరు 22న శంకుస్థాపన జరగగా.. సోమవారం (ఏప్రిల్ 25న) పునర్నిర్మించిన ఆలయంలో విగ్రహ ప్రతిష్ట జరిగింది. వైఖానస ఆగమ పండితులు నిర్ణయించిన ముహుర్తం మేరకు సోమవారం ఉ.7.37 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రామస్వామి వార్లను పునఃప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

కాగా, 2020 డిసెంబరు 28వ తేదీ అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగలు కొండపై స్వామి విగ్రహాన్ని తొలగించి.. కొండపైన కోనేరులో పడేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో అప్పట్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో విగ్రహాల పునఃప్రతిష్టతో పాటు పురాతన ఆలయం మొత్తాన్ని కూడా పునర్నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. సంఘటన జరిగిన ఐదు రోజుల్లోనే నాటి దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి రూ.3 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు.

2021 జనవరి 3న మంత్రి ప్రకటన చేయగా.. జనవరి 9కల్లా దేవదాయ శాఖ అనుమతులిచ్చింది. అలాగే, జనవరి 22 నాటికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శ్రీ సీతారామలక్ష్మణ నూతన విగ్రహాలు రామతీర్థం చేరాయి. 28న కొండ కింద శ్రీరామాలయంలోని ఏర్పాటుచేసిన బాలాలయంలో ఆ విగ్రహాల చర ప్రతిష్ట జరిగింది. ఇక 2021 ఆగస్టు నాటికే పాత ఆలయాల శిథిలాలను తొలగించి కొత్త ఆలయ పనులు ప్రారంభించాలని ఉన్నతాధికారులు నిర్ణయించినప్పటికీ, అప్పట్లో రెండుసార్లు తుపాను రావడం.. గ్రానైట్‌ రాళ్ల తరలింపునకు అవరోధాలు ఎదురవడంతో డిసెంబర్‌లో శంకుస్థాపన జరిగింది. ఇక పాత ఆలయం స్థానంలో గ్రానైట్‌ రాయితో కొత్త ఆలయాన్ని నిర్మించారు. ఆలయ పునర్నిర్మాణం పూర్తిచేసేందుకు జనరేటర్ల సాయంతో రాత్రి వేళల్లో పనులు జరిపారు. ప్రధాన ఆలయ పనులు ఇప్పటికే పూర్తికాగా, ఆలయం వద్ద మరికొన్ని ఆదనపు వసతులు కల్పించనున్నారు.  గర్భాలయంతో పాటు ఆలయ మండపం, ధ్వజస్తంభం, ప్రాకారం (కాంపౌండ్‌ వాల్‌), కొత్తగా యాగశాలనూ నిర్మిస్తున్నారు. వీటిని మరో మూణ్ణెలల్లో పూర్తిచేయనున్నట్లు అధికారులు తెలిపారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement