ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బార్ల కోసం కొత్త పాలసీని తీసుకువస్తోంది. ఆర్థిక కష్టాల కారణంగా బార్లను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం 840 బార్లు ఉండగా వాటిని యథాతథంగా కొనసాగించాలని భావిస్తోంది ఏపీ సర్కారు. కానీ, ఆదాయం కోసం లైసెన్సు ఫీజులు మాత్రం భారీగా పెంచనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 3 శ్లాబుల్లో.. 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.10 లక్షలు.. 50వేలు నుండి 3లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లోరూ. 20 లక్షలు.. 3లక్షలకు పైగా ఉన్న ప్రాంతాల్లో రూ. 30 లక్షలు.. ఫీజు వసూలు చేస్తున్నారు. కాగా, వాటిని ఇప్పుడు వరుసగా రూ.20 లక్షలు, రూ.30 లక్షలు, రూ.50 లక్షలుగా పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ కొత్త పాలసీకి నెల రోజులే సమయం ఉన్నందున వారం పది రోజుల్లో బార్ పాలసీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎక్సైజ్ శాఖ రెడీ అవుతోంది. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, ఎంపిక విధానం ఉంటాయి. అన్ని బార్లకు కొత్తగా దరఖాస్తులు స్వీకరించబోతున్నారు. వాస్తవానికి వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా వచ్చిన వారికి అవకాశాలు ఇచ్చింది. టీడీపీ కి దగ్గరగా ఉన్న వారందరిని దూరం పెట్టి, 2019 నవంబరులోనే కొత్త పాలసీకి శ్రీకారం చుట్టింది. కానీ తమకు 2022వరకు గడువు ఉందంటూ బార్ల యాజమాన్యాలు, కోర్టు మెట్లెక్కారు. దీంతో ప్రభుత్వం చేసిన ప్రయత్నం ముందుకు సాగలేదు. ఇప్పుడు పాలసీ గడువు పూర్తిగా ముగియటంతో అన్ని అస్త్రాలను సిద్దం చేసుకునేందుకు సర్కార్ రెడీ అయ్యింది.