Friday, November 22, 2024

Big story | అంగన్‌వాడీల కొత్త రూపు.. ప్రతి కేంద్రానికి రూ.2 లక్షలతో మెరుగులు

అమరాతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల ఆధునీకరణ, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఇప్పటికే నాడు – నేడు ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం, మరమ్మతులు చేపట్టిన ప్రభుత్వం, దానికి అవసరమైన నిధులను కేటాయిస్తోంది. ఇదే సమయంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు సమగ్రమైన పోషకాహారంతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అత్యంత నాణ్యతాప్రమాణాలతో కూడిన పోషకాహారాన్ని చిన్నారులకు అందిస్తూ వారి ఆరోగ్య సంరక్షణకు కృషి చేస్తోంది. మరోవైపు చిన్నారులకు డిజిటల్‌ విధానంలో బోధన సాగించేలా చర్యలు తీసుకున్నారు.

రకరకాల ఆటబొమ్మలతో ఆంగ్లంపై చిన్నారులు పట్టు సాధించేలా ప్రత్యేక కరిక్యులమ్‌ను రూపొందించి అమలు చేస్తోంది. చిన్నారుల ఆట, పాటలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లే గ్రౌండ్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ముఖ్యంగా అంగన్‌వాడీ కేంద్రాల ఆధునీకరణ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం రాష్ట్రంలోని 257 ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ల పరిధిలోని 55 వేల 607 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆధునిక వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పాఠశాలలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో ఉన్న 21,197 అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునీకరించేందుకు గత బడ్జెట్‌లో రూ. 545 కోట్లను కేటాయించింది.

వాటిలో ఇప్పటికే రూ. 205 కోట్లకు పైగా నిధులను విడుదల చేసి పనులు వేగంగా సాగేలా చర్యలు తీసుకుంది. ప్రతి కేంద్రానికి మరమ్మతుల నిమిత్తం రూ. 2 లక్షలను మంజూరు చేసి వాటిని పూర్తిగా ఆధునీకరించింది. ఇక సొంత భవనాలు కలిగిన 10,472 అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా మౌలిక వసతుల కల్పనకు క ృషి చేస్తోంది. మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు మినరల్‌ వాటర్‌ ప్లాంట్ల ఏర్పాటు, ఫ్యాన్లు, ఇతర ఉపకరణాలను ఇప్పటికే అందించింది. ఇక అద్దె కేంద్రాల్లో సాగుతున్న 23,758 అంగన్‌వాడీ కేంద్రాలను ఇటీవలె అద్దె మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుని అమల్లోకి తీసుకువచ్చింది. దీంతో గతంలో ఇరుకు గదుల్లో ఉన్న ఈ ప్రైవేటు కేంద్రాలు ఇప్పుడు కొంత విశాల భవనాల్లోకి మారాయి.

దీంతో చిన్నారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బోధన సాగించే అవకాశం అంగన్‌వాడీలకు లభించింది. మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 15 వేల నుంచి ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా రూ. 20 వేలు వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. వాటర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు రూ. 10 నుంచి రూ. 15 వేలు ఖర్చు చేసింది. దీంతో గతానికి భిన్నంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు సమృద్ధిగా అభివృద్ధి చెందడంతో కేంద్రాలకు వచ్చే చిన్నారుల సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే 9 లక్షలకు పైగా చిన్నారులు అంగ న్‌వాడీ కేంద్రాల్లో విద్యాబ్యాసం సాగిస్తున్న పరిస్థితి ఉంది.

- Advertisement -

సిబ్బందికి ప్రోత్సాహకాలు..

అంగ న్‌వాడీ కేంద్రాల్లో ఉత్తమ పనితీరును కనబర్చిన సిబ్బందికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తలకు స్మార్ట్‌ ఫోన్లను ప్రభుత్వం అందించింది. 56 వేల 984 స్మార్ట్‌ ఫోన్లను దాదాపు రూ. 86 కోట్లతో కొనుగోలు చేసి సిబ్బందికి అందించింది. ఉత్తమ పనితీరును కనబరుస్తున్న సిబ్బంది పనితీరును గమనించి వారికి రూ. 500 అదనపు ప్రొత్సాహకంగా అందిస్తోంది.

ఇందుకోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 27 కోట్లను కేటాయించి చిత్తశుద్ధిని నిరూపించుకుంది. ఇక ఎంతోకాలంగా ప్రమోషన్లు లేకుండా వర్కర్లుగానే ఉంటున్న అంగన్‌వాడీలకు ప్రమోషన్లు కూడా కల్పించింది. అర్హత కలిగిన 560 మంది అంగన్‌వాడీలకు గ్రేట్‌ – 2 సూపర్‌వైజర్లుగా పదోన్నతులు కల్పించింది. ముఖ్యంగా వ యోపరిమితి నిబంధన ప్రమోషన్లకు అడ్డంకిగా మారిన పరిస్థితుల్లో ప్రభుత్వం దాన్ని కూడా పరిష్కరించి 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు వయో పరిమితిని సడలించి వారికి పదోన్నతులు లభించేలా చర్యలు తీసుకుంది. వర్కర్లకు, హెల్పర్లకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే వార్షిక సెలవులు, మెటర్నిటీ లీవ్‌లకు అవకాశం కల్పించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అంగన్‌వాడీ వ్యవస్థలో పెనుమార్పులు తీ సుకొచ్చినట్లుగా స్పష్టమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement