Tuesday, November 26, 2024

బ్లడ్‌ బ్యాంకులకు నూతన మార్గదర్శకాలు.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

అమరావతి, ఆంధ్రప్రభ: రక్తసేకరణ, రక్తం కాంపొనెంట్స్‌ ప్రోసెసింగ్‌కు సంబంధించి బ్లడ్‌బ్యాంకులు నూతన మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్‌ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ (శాక్స్‌) ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ జీఎస్‌ నవీన్‌కుమార్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు అమలు చేస్తున్న మార్గదర్శకాలను సవరిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఎయిడ్స్‌ నియంత్రణ విభాగం (ఏసీడీ) తాజాగా ఆదేశాలను జారీ చేసిందన్నారు. అన్ని బ్లడ్‌ బ్యాంక్‌లు వీటిని కచ్చితంగా అనుసరించాల్సిందేనన్నారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా అవినీతి జరిగినట్లు దృష్టికి వస్తే ప్రజలు 14400 నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. రక్తం, రక్తం కాంపొనెంట్స్‌ సేకరణకు సంబంధించి ప్రొసెసింగ్‌ ఛార్జీలు బ్లడ్‌ బ్యాంక్‌లలో వసూలు చేస్తున్న వివిధ సర్వీస్‌ ఛార్జీలను సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని జాతీయ రక్త మార్పిడి మండలి (ఎన్‌బీటీసీ) టెక్నికల్‌ వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసిందన్నారు. 2022 సంవత్సరానికి సవరించిన ప్రోసెసింగ్‌ ఛార్జీలు వెంటనే అమల్లోకి వస్తాయన్నారు.

ప్రభుత్వ బ్లడ్‌ బ్యాంకుల్లో పూర్తి రక్తాన్ని ప్రోసెసింగ్‌ చేసినందుకు యూనిట్‌కు రూ.1,100, ప్యాక్‌ చేసిన ఎర్ర రక్త కణాలు యూనిట్‌కు రూ.1,100 చొప్పున, ప్రైవేటు బ్లడ్‌ బ్యాంకుల్లో ఒక యూనిట్‌ పూర్తి రక్తం ప్రొసెసింగ్‌కు రూ.1,550, ఒక యూనిట్‌ ప్యాక్‌ చేసిన ఎర్ర రక్త కణాలకు రూ.1,550 ధర నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. వ్యక్తులు స్వయంగా చేయించుకొనే పరీక్షలు, రక్తం కాంపోనెంట్స్‌, ఇతర ప్రోసెసింగ్‌ ఛార్జీలను కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఖరారు చేసిందన్నారు. ఈ సవరణలోనే అదనపు ఛార్జీలు కూడా ఉన్నాయి కాబట్టి ఇతర అదనపు ఛార్జీలను వసూలు చేయకూడదన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర రక్త సేకరణ కేంద్రాల్లో మిగులు ప్లాస్మా మార్పిడి విలువను లీటర్‌కు రూ.1600 గా నిర్ణయించిందన్నారు. రోగుల ప్రయోజనార్థం రక్తం కాంపొనెంట్స్‌కు సంబంధించి ప్రొసెసిర్‌ ఛార్జీలను రక్తసేకరణ కేంద్రాల నోటీసు బోర్డుల్లో కనబడేలా ప్రదర్శించాలని కేంద్రం నిర్ధేశిందని ఆయన తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement