Tuesday, November 19, 2024

New Flights – విశాఖపట్నం- విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం

విశాఖ విమానాశ్రయంలో విశాఖపట్నం- విజయవాడ మధ్య నడిచే ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు నేడు ప్రారంభించారు. దీంతో నేటి నుంచి విశాఖపట్నం- విజయవాడ మధ్య కొత్తగా రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.

ఈ సందర్భంగా రామ్మోహన్‌ నాయుడు మాట్లాడారు.”విశాఖ-విజయవాడ మధ్య ఫ్లైట్ కనెక్టివిటీ పెంచాలని చాలా మంది కోరారు. ఒకేసారి రెండు నగరాల మధ్య రెండు ఫ్లైట్లు ప్రారంభం కావడం బహుశా ఇదే మొదటిసారి. ప్రజల కోరిక మేరకు ఈ మార్గంలో రెండు సర్వీసులు ప్రారంభించాం. రెండు నగరాల మధ్య ఎక్కువ సీట్లు అందుబాటులోకి రావడంతో విమాన టికెట్ల ధరలు తగ్గుతాయి. విశాఖ విజయవాడ మధ్య రూ.3000కే టికెట్ దొరికే అవకాశం ఉంది అని అన్నారు

.”విశాఖ ఎంతో అభివృద్ధి చెందుతున్న నగరం. దీనిని మరింత అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృతనిశ్చయంతో ఉన్నాయి. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కనెక్టవిటీ ఎంతో అవసరం. విశాఖ-గోవా మధ్య విమాన సర్వీసులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. విశాఖ నుంచి అత్యధిక కనెక్టివిటీలు ఉండేలా కృషి చేస్తాను. భోగాపురంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్‌పోర్ట్‌ నిర్మిస్తున్నాం. ఎయిర్ సర్వీస్ యూనివర్సిటీని అక్కడ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలోని కొత్త ప్రాంతాల్లో విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు వేస్తున్నాం అని కేంద్ర మంత్రి చెప్పారు.

- Advertisement -

రాష్ట్రంలో విమానయానరంగం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. విజయవాడ వేదికగా డ్రోన్ షో నిర్వహించాం. ఈ డ్రోన్ షో ఐదు రికార్డులు నెలకొల్పింది. ఓర్వకల్లు ప్రాంతంలో 300 ఎకరాలు డ్రోన్ సిటీ కోసం కేటాయించాం. విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ నగరానికి మంత్రి నారా లోకేశ్‌ టీసీఎస్‌ను తీసుకొచ్చారు. విశాఖను స్పోర్ట్స్ హబ్‌గా తయారు చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని రామ్మోహన్‌ నాయుడు వెల్లడించారు

ఇక ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు ఉదయం 9:35 గంటలకు విశాఖలో బయలుదేరి 10:35కు విజయవాడ (గన్నవరం విమానాశ్రయం) చేరుతుంది. తిరిగి రాత్రి 7:55కు విజయవాడలో బయలుదేరి 9 గంటలకు విశాఖ చేరుతుంది.

ఇండిగో సర్వీసు రాత్రి 7:15కు విజయవాడలో బయలుదేరి 8:20కి విశాఖ చేరుతుంది. అదే సర్వీసు తిరిగి రాత్రి 8:45కు విశాఖలో బయలుదేరి 9:50కి విజయవాడ చేరుతుంది. ఈ కొత్త విమానాలతో కలిపి విశాఖ- విజయవాడ మధ్య తిరిగే సర్వీసుల సంఖ్య మూడుకు చేరనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement