Monday, November 18, 2024

Big story : కొత్త జిల్లాలు, కొత్త పాలన.. 4న ఉదయం 9.05కు వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం జగన్‌

ఆంధ్రప్రభ, అమరావతి బ్యూరో : రాష్ట్రంలో కొత్త జిల్లాల పాలన మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. సోమవారం ఉదయం 9.05 నిమిషాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కొత్త జిల్లాల పాలనను లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో సీఎం జగన్‌ పాలనను ప్రారంభించే సమయానికే రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల కలెక్టరేట్లలో కొత్త కలెక్టర్లు తమ జిల్లా పాలనను ప్రారంభించనున్నారు. ఆ దిశగా అవసరమైన పక్రియను వేగవంతంగా పూర్తి చేశారు. అందుకు సంబంధించి శనివారం పొద్దుపోయాక గెజిట్‌ను కూడా విడుదల చేశారు. అంతకు ముందే ఐఏఎస్‌, ఐపీఎస్‌ బదిలీలు కూడా జరిగాయి. ఆదివారం ఉదయం నుంచి దశల వారీగా డిఆర్వో, ఆర్డీఓ తదితర అధికారుల బదిలీలు కూడా చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలకు కొత్త సారథులతో సరికొత్త జిల్లా అధికార యంత్రాంగాన్ని శరవేగంగా నియమించారు.

13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచుతూ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపధ్యంలో రెవెన్యూ డివిజన్ల సంఖ్యను కూడా 52 నుంచి 74కు పెంచింది. అందుకు సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏదైనా అభ్యంతరాలు ఉంటే మార్చి మొదటివారంలోపు తెలపాలని 25 రోజులు గడువిచ్చింది. అందుకోసం ప్రత్యేకంగా కమిటీని కూడా ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి 17 వేలకు పైగా వినతులు వచ్చాయి. వాటిని పరిశీలించి సుమారు 100కు పైగా మార్పులు చేపట్టారు. అందులో భాగంగానే రెవెన్యూ డివిజన్ల సంఖ్యను అదనంగా మరో 5కు పెంచారు. అదేవిధంగా ఆయా నియోజకవర్గాల పరిధిలో కొన్ని మండలాలను పాత జిల్లాల్లోనే కొనసాగిస్తూ తుది గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్త జిల్లాల ఏర్పాటు పక్రియ పూర్తయినట్లయింది.

శ్రీకారం..

ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన పాలనను అందిస్తానని గతంలో ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఉగాది నుంచి రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి కొత్త పాలనను అందించాలని సంకల్పించారు. అందులో భాగంగానే ఉగాది నాడే పాలనను ప్రారంభించాలని మొదట ముహూర్తం నిర్ణయించినప్పటికి వరుస సెలవుల నేపధ్యంలో సోమవారానికి(ఏప్రిల్‌ 4)కు మార్చారు. అదేవిధంగా నరసరావుపేట జిల్లా కేంద్రం నుంచి కొత్త పాలనను లాంఛనంగా ప్రారంభించాలని అనుకున్నప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమాన్ని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచే చేపట్టాలని చివరి నిమిషంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో సోమవారం ఉదయం 9.05 నిమిషాల నుండి 9.45 నిమిషాలలోపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కొత్త జిల్లాల పాలనను ప్రారంభించబోతున్నారు. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచుతూ శనివారం రాత్రి ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేసింది. అంతకు ముందే 26 జిల్లాలకు సారథుల నియామకానికి సంబంధించి కూడా జీవోను విడుదల చేసింది. కొన్ని పాత జిల్లాలకు పాత కలెక్టర్లనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త జిల్లాలతో పాటు మరికొన్ని పాత జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. అలాగే ఐపీఎస్‌ బదిలీల పక్రియను కూడా అంతే వేగవంతంగా చేపట్టింది. రాష్ట్ర చరిత్రలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీలు పెద్ద ఎత్తున చేపట్టడం ఇదే మొదటిసారి. వీరితో పాటు డీఆర్వోలు, ఆర్డీఓల బదిలీలు కూడా పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున డిప్యూటి కలెక్టర్ల బదిలీలను చేపట్టింది. దీంతో దాదాపుగా రెండు, మూడు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కొత్త సారథులతో కొత్త జిల్లాల పాలన ముందుకు సాగ బోతుంది.

ఒకట్రెండు రోజుల్లో..పూర్తి స్థాయి యంత్రాంగం…

- Advertisement -

రాష్ట్రంలో 26 కొత్త జిల్లాలకు సంబంధించి ఇప్పటికే కలెక్టర్‌ , ఎస్పీ, డీఆర్వో, ఆర్డీఓ, మున్సిపల్‌ కమిషనర్ల వంటి కీలక విభాగాలకు కొత్త సారథులను ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా సోమ, మంగళవారాల్లో 56 శాఖలకు సంబంధించి జిల్లా అధికారుల నియామక పక్రియను పూర్తి స్థాయిలో చేపట్టనుంది. అందుకు సంబంధించి కసరత్తు కూడా దాదాపు పూర్తయింది. ఇప్పటికే రెవెన్యూ విభాగంలో బదిలీల పక్రియ వేగవంతంగా సాగుతోంది. మండల స్థాయిలో కూడా మార్పులతో పూర్తి స్థాయి యంత్రాంగాన్ని నియమించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వీటితో పాటు ఆయా మున్సిపాలిటీలు, కీలకమైన విభాగాలకు సంబంధించి జిల్లా అధికారుల నియామకాన్ని కూడా ఒకట్రెండు రోజుల్లో పూర్తి చేయబోతుంది. కొత్త జిల్లాల పాలన వైపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శరవేగంగా అడుగులు వేశారు. అంతే వేగంగా రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన పాలనను అందించేందుకు 13 జిల్లాలను 26 జిల్లాలకు విభజిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో సరికొత్త పాలన, విప్లవాత్మక మార్పులకు సీఎం జగన్‌ శ్రీకారం చుట్టినట్లయింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement