నెల్లూరు, (ప్రభ న్యూస్): జిల్లాలో నేరాల కట్టడికి ఎస్పీ విజయరావు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు జిల్లా కేంద్రంలోనే క్లూస్ టీమ్ బృందం ఉండేది. జిల్లాలోనే ఏదైనా ప్రాంతంలో చోరీలు, దోపిడీలు, దోపిడీ హత్యలు, మిస్టరీ హత్యలు చోటుచేసుకున్నప్పుడు జిల్లా కేంద్రం నుండి ఈ క్లూస్ టీమ్ బృందం సంఘటనా స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరించేవారు. అయితే జిల్లాలోని దూర ప్రాంతంలో ఏదైనా నేరం జరిగినప్పుడు జిల్లా కేంద్రం నుండి క్లూస్ టీమ్ బృందం అక్కడకు చేరుకునేలోపు కొన్ని ఆధారాలు, సాక్ష్యాలు చెదిరిపోయే అవకాశం ఉండేది. దీనిపై దృష్టి సారించిన ఎస్పీ జిల్లాలోని అన్నీ సబ్‌డివిజన్లలో క్లూస్ టీమ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించి 21 మంది సిబ్బందికి ప్రత్యేక శిక్షణను ఇప్పించారు.
ప్రతి సబ్ డివిజన్ పరిధిలో ఒక హెడ్‌కానిస్టేబుల్ నేతృత్వంలో సిబ్బందిని నియమించి క్లూస్ టీమ్‌గా ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శిక్షణ పూర్తి చేసుకున్న ఈ క్లూస్ టీమ్ బృందాలకు అవసరమైన పరికరాలు, వాహనాలను సిద్దంచేసి అందించారు. అనంతరం ఎస్పీ ఈ క్లూస్ టీమ్ బృందాలతో మాట్లాడుతూ నేరం జరిగిన స్థలంలో దొరికే చిన్న ఆధారం కూడా కేసు విచారణకు ఎంతో ఉపయోగపడుతుందని, ఈ విషయాన్ని క్లూస్ టీమ్ సిబ్బంది దృష్టిలో ఉంచుకుని ఆధారాల సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అదేవిధంగా మనం సేకరించే సాక్ష్యాలతోనే నేరస్తులకు న్యాయస్థానంలో శిక్షలు ఖరారవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ పి వెంకటరత్నం, ఏఆర్ డీఎస్పీ ఎం గాంధీ, ఆర్‌ఐ పౌల్‌రాజు, క్లూస్ టీమ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital