Tuesday, November 26, 2024

పూజకోసం తెచ్చిన కొత్త బండి.. ఒక్కసారిగా బ్లాస్ట్​ అయిన బుల్లెట్​.. భక్తులకు తప్పిన పెను ప్రమాదం

గుంతకల్లు, (ప్రభ న్యూస్): ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం ఆంజనేయస్వామి దేవస్థానం వద్ద ఓ బుల్లెట్ బండిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పేలిపోయింది. ఈ ఘటన ఉగాది పర్వదినం రోజున చోటు చేసుకుంది. బైక్ పేలినప్పుడు స్థానికులతో పాటు భక్తులను కూడా తీవ్ర భయబ్రాంతులకు గురి చేసింది. వాస్తవానికి పూజాదికాలు కోసం నిలబెట్టిన బైక్ నందు పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అక్కడున్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. పూర్తిగా కాలిపోయిన బుల్లెట్ బైక్ ట్యాంక్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ బుల్లెట్ లో మంటలు, ఎండవేడిమికి వచ్చాయా ? లేక ఏదైనా సాంకేతిక లోపమా ? అన్న విషయం స్పష్టంగా తెలియరాలేదు. మైసూరు పట్టణానికి చెందిన రవిచంద్ర అనే భక్తుడు నూతన తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని కొత్తగా కొన్న బైక్ కు నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు చేయించుకోవడానికి రైలులో తీసుకువచ్చాడు.

గుంతకల్లు రైల్వే స్టేషన్ నుంచి కసాపురం దేవస్థానానికి వెళ్ళి అక్కడ వాహన పూజ కోసం దేవస్థానం ఎదురుగా ఉన్న పార్క్ పక్కన నిలబెట్టాడు. ఉన్నట్టుండి బైక్ లో మంటలు చెలరేగి పేలిపోయింది. అయితే స్థానికులు అప్రమత్తంగా ఉండి బైక్ పై నీళ్లు చల్లి మంటలు ఆర్పి వేయడంతో పక్కన ఉన్న ఇతర బైకులకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్త పడడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు కారణం ఆ సమయంలో పార్క్ లోని చెత్తకు నిప్పు పెట్టీ ఉండగా ఏమైనా నిప్పు రవ్వ ఎగిరి వచ్చి బైక్ మీద పడిందా? అన్న అనుమానం కూడా భక్తులు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పూజ సమయంలో బైక్ కు హారతి ఇస్తారు. అలా హారతి ఇచ్చే సమయంలో కర్పూరం ఏమైనా పడిందా ? అన్న మరో అనుమానం కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఉగాది పండుగను పురస్కరించుకొని కసాపురం స్వామివారి రథోత్సవానికి వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం తో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్న సమయంలో ఇలా పెద్ద శబ్దంతో బుల్లెట్ బండి పేలిపోవడం, మంటలు ఎగసి పడడం వల్ల భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఐతే ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరుగక పోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాద సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని అధికారులు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement