Sunday, November 17, 2024

New Candidate – వైజాగ్ లో వైసీపీ జామ్.! ఎంపీ అభ్యర్థి కరవు

(ఆంధ్రప్రభ స్మార్ట్, విశాఖపట్నం ప్రతినిధి) – ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా.. పిటీషన్ల మీద పిటీషన్లతో న్యాయస్థానాల్లో ఇరకాటం పెట్టినా.. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా.. విశాఖను తీర్చిదిద్దే మహాక్రతువును నిర్విఘ్నంగా నిర్వహిస్తూ.. ఉత్తరాంధ్ర మదిలో చెరగని ముద్రకు సీఎం జగన్ యత్నిస్తున్న తరుణంలో… విశాఖపట్నంలో వైసీపీని అనేక బారికేడ్లు అడ్డుకుంటున్నాయి. ఒక్క విశాఖపట్నంలోనే ప్రతి అంశంలోనూ హంసపాదులు తప్పటం లేదు. నిజానికి 2019 ఎన్నికల్లో విశాఖ రూరల్ జిల్లాలో వైసీపీ తిరుగులేని పాగా వేసింది. అంతటి వైసీపీ గాలిలోనూ విశాఖపట్నంలోని నాలుగు నియోజకవర్గాల్లో గట్టి దెబ్బ తగిలింది. ఇక్కడ టీడీపీ నిలదొక్కుకుంది. సిటీలో వైసీపీ బలం తగ్గినప్పటికీ ఎంపీ స్థానాన్ని సాధించింది. ఈ స్థితిలోనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా అసెంబ్లీలో మూడు రాజధానులు ప్రకటించి విశాఖపట్నంలో రాజకీయ దూకుడు పెంచారు. కానీ 2023 మార్చిలో ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ గెలవటంతో ,,, షాక్‌తో ఉత్తరాంధ్రలో టీడీపీ వైపే జనం మొగ్గు చూపుతున్నారని వైసీపీ గ్రహించింది. రుషికొండలో మార్పులు చేసి, సీఎం క్యాంపు కార్యాలయాన్ని వైజాగ్‌కు తరలించాలని నిర్ణయం తీసుకుంది. కానీ అడుగడుగునా ఆటంకాలు తప్పటం లేదు. ఇక ఆంధ్రా యూనివర్శిటీలో వైఎస్‌ఆర్‌సీపీ సమావేశాల్లో తడబాటు తప్పలేదు.

బారికేడ్ లు ఇవే
2019 నుంచి ఏపీలోని ఇతర జిల్లాల కంటే విశాఖపట్నంలో భూకబ్జా ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయి, దీనివల్ల ప్రజలు తమ భూములను కాపాడుకోవాలని తపిస్తున్నారు. ప్రధానంగా ఎంపీ కుటుంబాన్ని రౌడీ షీటర్లు కిడ్నాప్ చేయటం మరో విశేషం. ఈ స్థితిలో విశాఖ ఎంపీ స్థానంలో కొత్త వ్యక్తిని రంగంలోకి దించాలని వైసీపీ అధిష్టానం నిర్ఱయం తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో విశాఖ తూర్పు నుంచి ప్రస్తుత ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పోటీ చేస్తారని వైసీపీ ప్రకటించటమే కాదు.. విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను ప్రకటించింది. ,ప్రస్తుతం విశాఖలో పార్టీ నాయకులెవరూ ఎంపీగా పోటీకి ఆసక్తి చూపటం లేదు. విశాఖ ఎంపీలుగా పోటీ చేయటానికి భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ అధిష్టానం కోరింది. కానీ ఇద్దరూ నిరాకరించారని సమాచారం.

బొత్స ఝాన్సీకి గొల్డెన్ ఛాన్స్.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీలక్ష్మి విశాఖపట్టణం లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి, విశాఖపట్నంలో అభ్యర్థుల కొరత బొత్స ఝాన్సీ పేరును అధిష్ఠానం పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆమె విజయనగరం నుంచి ఎంపీగా పనిచేశారు. విశాఖ సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఈసారి విశాఖ తూర్పు నుంచి అసెంబ్లీ బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఝాన్సీ పేరు తెరపైకి వచ్చింది. ఆమెను విశాఖ లోక్‌సభకు పోటీ చేయించే విషయంలో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడ నుంది.. ఝాన్సీ పోటీకి బొత్స కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఐతే, ఈ విషయం తనకు తెలీదని, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి పని చేస్తామని బొత్స సత్యనారాయణ చెప్పటం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement