Tuesday, November 26, 2024

ఏపీ గవర్నర్ ను కలిసిన గౌతమ్ సవాంగ్, రాజేంద్రనాధ్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(sAPPSC) ఛైర్మన్ గౌతమ్ సవాంగ్, నూతన డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసారు. శుక్రవారం రాజ్ భవన్ దర్బార్ హాలులో గవర్నర్ తో విడివిడిగా వీరు సమావేశం అయ్యారు. వీరిని గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా స్వాగతించారు. ఈ సందర్భంగా గవర్నర్ కు గౌతమ్ సవాంగ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చేపడుతున్న వివిధ ఉద్యోగ నియామక ప్రక్రియలను గురించి వివరించారు. నిరుద్యోగులకు అవకాశాలు దక్కాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను రూపొందించి అమలు చేస్తుందని, తదనుగుణంగా వారు నష్టపోని విధంగా కార్యాచరణ అమలు చేస్తామని పేర్కొన్నారు. గవర్నర్ మాట్లాడుతూ ఎక్కువ మందికి ఉపాధి చూపే లక్ష్యంతో ప్రభుత్వం నిర్దేశిత ఉద్యోగ కాలమానిని రూపొందించటం శుభపరిణామమన్నారు. ఉద్యోగ నియామక ప్రక్రియలు పూర్తి పారదర్శకంగా చేపట్టాలన్నారు. న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకుని నియామక ప్రకటనలు జారీ చేయాలన్నారు.

అనంతరం కలిసిన నూతన డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్ధితిని గురించి గవర్నర్ కు వివరించారు. పోలీసు శాఖలో నూతనంగా చేపడుతున్న విధానాలను గురించి విపులీకరించారు. డిజిపితో గవర్నర్ మాట్లాడుతూ  చట్టం ముందు అందరూ సమానమేనని, అవగాహనా లేమి, నిరక్షరాస్యత ఫలితంగా ఏ ఒక్కరూ అన్యాయం కాకూడదని సూచించారు. కార్యక్రమంలో రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ , నగర పోలీస్ కమీషనర్ కాంతిరాణా టాటా, రాజ్ భవన్ ఉప కార్యదర్శి సన్యాసి రావు తదితరుల పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement