ఇద్దరి పరిస్థితి విషమం..
గత ఏడాది రియాక్టర్ పేలి ముగ్గురు మృతి..
బాధితులను ఆదుకోవాలని ప్రజా సంఘాలు నిరసన..
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆర్డిఓ చైత్ర వర్షిని..
కర్మాగారం పై క్రిమినల్ కేసు నమోదు డి.ఎస్.పి ప్రసాద్..
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించండి ఎమ్మెల్యే మేకపాటి..
మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి – మాజీ ఎమ్మెల్యే బొల్లినేని..
భయబ్రాంతులలో కర్మాగార కార్మికులు..
ఉదయగిరి, – కూటి కోసం కోటి విద్యలు అన్నట్లుగా, మానవనీ జీవితంలో కుటుంబాన్ని పోషించుకునేందుకు కర్మాగారంలో ఉద్యోగాలను సంపాదించారు. సజావుగా సంసారం జరుగుతున్న తరుణంలో దేవుడు చిన్నచూపు చూశాడు. విధి నిర్వహణలో ఉన్న వారిపై విషవాయువు వెలువడటంతో ఒక్కసారిగా కుప్పకూలారు విగత జీవులుగా పడిపోయారు. వారిలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు ప్రాణాల కోసం పోరాటం చేస్తున్నారు. దీంతో పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలు శోక సముద్రంలో మునిగి పోయి ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. వింజమూరు మండలం చంద్ర పడియ గ్రామ సమీపంలోని శ్రీ వెంకట నారాయణ యాక్టివ్ ఇంగ్రేడియంట్ ప్రైవేట్ లిమిటెడ్ కర్మాగారంలో రియాక్టర్ కు వెళ్లే గ్యాస్ లీకై విషవాయువు వ్యాపించి అక్కడ విధులు నిర్వహిస్తున్న ముగ్గురు టెక్నీషియన్స్ మృతి చెందిన సంఘటన మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో చోటుచేసుకుంది. స్థానికులు, అధికారులు కర్మాగార మేనేజ్మెంట్ వారు తెలిపిన వివరాల మేరకు రాత్రి, ఉదయం రెండు షిఫ్టులుగా అక్కడ కార్మికులు విధులు నిర్వహిస్తారని, ఉదయం ఆరు గంటల వరకు విధులు నిర్వహించిన వారు డ్యూటీ దిగి వెళ్లిపోగా ఉదయం విధులకు హాజరైన టెక్నీషియన్స్ విధులు నిర్వహిస్తుండగా రియాక్టర్ పైపుల్లో ఎక్కడో గ్యాస్ లీకై విషవాయువు వ్యాప్తిచెందింది. దీంతో విధుల్లో ఉన్న ఐదు మంది కార్మికులు ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. వారిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు ప్రాణవాయువు కోసం పోరాటం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆత్మకూరు ఆర్డిఓ చైత్ర వర్షిని, కావలి డిఎస్పి దేవరకొండ ప్రసాద్, తహసీల్దార్ ఎన్ వి కే సుధాకర్ రావు, ఎంపీడీవో కనక దుర్గ భవాని, కలిగిరి సిఐ శ్రీనివాస రావు, వింజమూరు ఎస్ ఐ బాజిరెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను పత్యేక అంబులెన్స్ ద్వారా నెల్లూరులోని కిమ్స్ వైద్యశాలకు తరలించారు. జిల్లా పొల్యూషన్ బోర్డు అధికారులు, బిసిహెచ్ఓ బృందం కర్మాగారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కావలిడి ఎస్పి దేవరకొండ ప్రసాద్ మాట్లాడుతూ విషవాయువుతో ఒంగోలుకు చెందిన బెల్లంకొండ శ్రీను (28) ఏఎస్ పేట మండలం చౌట భీమవరానికి చెందిన పి. తిరుపతయ్య (54) ఉదయగిరి మండలం తిరుమలాపురం గ్రామానికి చెందిన డి. తిరుపతయ్య (60) మృతి చెందినట్లు ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు తెలిపారు. అలాగే వింజమూరు పట్టణానికి చెందిన బాలకృష్ణ, షరీఫ్ లు నెల్లూరులోని కిమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారని వారికి ఎలాంటి ప్రాణహాని లేదని తెలిపారు. అలాగే కర్మాగారం పై క్రిమినల్ కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఆత్మకూరు ఆర్డిఓ చైత్ర వర్షిని మాట్లాడుతూ పోలీస్, పొల్యూషన్ బోర్డ్, రెవిన్యూ, ఫ్యాక్టరీల నిర్వహణ డిసిహెచ్ వో అధికారులు ఒక బృందంగా ఏర్పడి దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని, ఎక్కడ తప్పిదం జరిగిందో గుర్తించిన ఫిదప బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. గత ఏడాది జూన్ మాసంలో కర్మాగారంలో రియాక్టర్ పేలి ముగ్గురు మృతి చెందినట్లు కూడా తన దృష్టికి వచ్చిందని, దానిపైన విచారించగా ఆరు నెలల పాటు రియాక్టర్ విభాగం ఆపివేయడం జరిగిందన్నారు. అప్పట్లో పూర్తిస్థాయిలో అధికారులు పరిశీలించిన తర్వాతనే పున ప్రారంభించారన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆర్డిఓ ఎవరిచ్చారు. విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వింజమూరు మండల కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి, ఎంపీపీ అభ్యర్థి పల్లాల కొండా రెడ్డి లను కర్మాగారం వద్దకు పంపించి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. అక్కడికి చేరుకున్న నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. ఫ్యాక్టరీ లోనికి అనుమతించకపోవడంతో రెండు మూడు గంటల పాటు బయట ఉన్నారు. ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో జరిగిన సంఘటనను కవర్ చేసేందుకు వెళ్లిన పాత్రికేయులను కూడా మధ్యాహ్నం వరకు అనుమతించలేదు. గోప్యంగానే లోపల అన్ని జరిగి పోతున్నాయని ప్రజా సంఘాల నాయకులు నిరసనకు దిగారు. బాధితులకు న్యాయం చేయాలని కర్మాగారం ఎదుట నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు జరిగిన సంఘటన తెలుసుకొని దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు యాభై లక్షలు ఇవ్వాలన్నారు. గత మూడు సంవత్సరాలుగా కర్మాగారంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూన్న వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. పెద్దదిక్కును కోల్పోయి శోక సముద్రంలో మునిగిపోయారు. విధులకు వెళ్లి విగతజీవులుగా మిగిలారు. దీంతో ఆయా గ్రామాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.