Monday, November 18, 2024

కుక్కల దాడిలో చుక్కల దుప్పి మృతి

ముత్తుకూరు ఏప్రిల్ 17( ప్రభ న్యూస్) : అడవుల్లో నుంచి గ్రామంలోకి వచ్చిన ఓ చుక్కల దుప్పి పై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేయడంతో మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం పరిధిలో ఉన్న అడవిలో చుక్కల దుప్పి దారిత‌ప్పి మండలంలోని నారికేళ్ళపల్లి గ్రామానికి వచ్చింది. దుప్పిని చూసిన వీధి కుక్కలు ఒక్క‌సారిగా వెంబ‌డించాయి. ఇది గ‌మ‌నించిన గ్రామస్తులు దుప్పిని రక్షించారు. అప్పటికే కుక్కల దాడిలో దుప్పి తీవ్ర గాయాలకు గురైంది. ఈ విషయాన్ని గ్రామస్తులు గ్రామ సచివాలయం ఉన్నతాధికారి యస్థాని భాషాకు తెలియపరిచారు. వెంటనే గ్రామం చేరుకున్న అధికారి ఆ దుప్పిని పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పారు. పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీనివాసులు, సెక్షన్ ఆఫీసర్ శేషయ్య పోలీస్ స్టేషన్ కు చేరుకుని దుప్పిని అడవీ ప్రాంతానికి త‌ర‌లిస్తుండ‌గా మార్గం మధ్య‌లోనే ప్రాణాలు కోల్పోయింది. దీంతో అటవీ శాఖ అధికారులు చనిపోయిన దుప్పిని మండల కేంద్రం ప్రభుత్వ ప్రాంతీయ పశువైద్యశాలకు తీసుకొచ్చారు. స్థానిక అసిస్టెంట్ డైరెక్టర్ నిర్మల దుప్పిని పరిశీలించగా మృతి చెందినట్లు గుర్తించారు. దుప్పి వయసు సుమారు నాలుగు సంవత్సరాలు ఉంటుందని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. పోస్ట్ ఆర్టం నిమిత్తం దుప్పిని వెంకటాచలం అడవుల్లోకి తీసుకువెళ్లి అక్కడ దహనం చేస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ విషయం గురించి పోలీసు శాఖ అధికారులకు చెబుతామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement