నెల్లూరు, (ప్రభన్యూస్) : జిల్లాలో అసాంఘీక కార్యకలాపాలు పూర్తి స్థాయిలో కట్టడి కావాలని జిల్లా ఎస్పీ సీహెచ్.విజయరావు పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని మిని కాన్ఫెరెన్స్ హాల్ నుండి జూమ్ యాప్ ద్వారా జిల్లా ఎస్పీ సీహెచ్. విజయరావు సోమవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసాంఘీక కార్యకలాపాలైన జూదం, వ్యభిచారం, క్రికెట్ బెట్టింగులు, అనధికార మద్యం విక్రయాలు, గంజాయి అక్రమ రవాణా, నిషేదిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు పూర్తి స్థాయిలో కట్టడి కావాలన్నారు. పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలన్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్లపై దృష్టి సారించి సంబంధిత వ్యక్తులను న్యాయస్థానంలో హాజరుపరిచేలా చర్యలు చేపట్టాలన్నారు. చిన్నారులు, మహిళలకు సంబంధించి కేసుల్లో అలసత్వం ప్రదర్శించకుండా తక్షణమే స్పందించి వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలకు కౌన్సిలింగ్ నిర్వహించాలని, వినని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిస్సింగ్ కేసుల్లో నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన గాలింపు చర్యలు చేపట్టి అదృశ్యమైన వ్యక్తుల ఆచూకీ తెలుసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించేలా చర్యలు చేపట్టాలన్నారు. డయల్ 100, దిశ ఎస్‌ఓఎస్ కాల్స్ అందుకున్న వెంటనే తక్షణమే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. పనితీరును మెరుగుపరుచుకుని ప్రజలకు చేరువయ్యేలా ప్రతిఒక్క సిబ్బంది పనిచేయాలని ఎస్పీ ఈ సందర్భంగా సూచించారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి
జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ విజయరావు పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతంలో సూచిక బోర్డులు, బారిక్యాడ్స్ ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న గ్రామీణ ప్రాంతాల వద్ద ప్రమాదాలు చోటుచేసుకోకుండా విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు.
నేరాలు నియంత్రించేందుకు గస్తీలు పెంచండి..
జిల్లాలో నేరాలను పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు రాత్రి సమయాల్లో గస్తీలు పెంచాలని, విజబుల్ పోలీసింగ్ పటిష్టంగా అమలు చేయాలని ఎస్పీ విజయరావు అధికారులను ఆదేశించారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో హోంగార్డు నుంచి ఎస్‌హెచ్‌ఓ వరకు టర్న్ ప్రకారం రాత్రి గస్తీలు నిర్వహించాల్సిందేనన్నారు. గస్తీలు నిర్వహించేటపుడు సిబ్బంది ఏఏ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు అనే వివరాలను ఫోటోలు, లొకేషన్లను వాట్సప్ ద్వారా ఉన్నతాధికారులకు షేర్ చేయాలన్నారు. స్టేషన్ల పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేలా గస్తీలు నిర్వహించాలన్నారు. బుధ, శనివారాల్లో రాత్రి సమయాల్లో గస్తీ నిర్వహిస్తున్న సిబ్బందితో సంబంధిత ఎస్‌హెచ్‌ఓలు (కప్ ఆఫ్ టీ) షేర్ చేసుకోవాలని తద్వారా సిబ్బంది నూతనోత్సాహంతో పనిచేసే అవకాశం ఉందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..