ఆత్మకూరురూరల్, ; ఆత్మకూరు పట్టణంలో అనేక మంది ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు విద్యనభ్యసించి ఉన్నత స్థానాలకు చేర్చిన ఆది ఆంధ్ర పాఠశాల అభివృద్దికి ఈ దఫా కూడా మొండి చేయి ఎదురైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నాడు నేడు పథకం కింద తొలి విడతలో ఎంపిక కావాల్సిన ఆది ఆంధ్ర పాఠశాల అప్పట్లో ఎంపిక కాకపోవడంతో పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారులకు, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. అప్పట్లో స్పందించిన అధికారులు ఆ పాఠశాలను సందర్శించి రెండవ విడతలో తప్పక మంజూరు అయ్యేలా చూస్తామని వారికి హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం సోమవారం ప్రకటించిన జాబితాలో కూడా ఆది ఆంధ్ర పాఠశాల పేరు రాకపోవడంతో పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు నిరాశకు గురయ్యారు. ఆత్మకూరు పట్టణ నడిబొడ్డున, మున్సిపల్ బస్టాండ్ వద్ద అనాధిగా ఉన్న మండల పరిషత్ ఆది ఆంధ్రా పాఠశాల రెండవ విడత నాడు నేడు కార్యక్రమంలో ఎంపిక కాలేదని తెలుసుకున్న ఆ పాఠశాల పూర్వ విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదనతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాఠశాల హరిజనవాడ, అరుంధతీయవాడ ప్రాంతాలకు అనుబంధంగా ఉంటుందని, గతంలో నిర్మించిన భవనాలు శిధిలావస్థకు చేరుకున్నాయని పాఠశాల అధ్యాపక బృందంతో పాటు పూర్వ విద్యార్ధులు అనేక మార్లు తెలిపినా రెండవ విడతలో కూడా మంజూరు కాకపోవడంతో వారంతా నిరాశకు గురయ్యారు. పూర్వ విద్యార్థులు ఈ పాఠశాలను ప్రోత్సహిస్తూ తరచూ విద్యార్థులకు అవసరమైన ఉపకరణాలను అందచేస్తుంటారు. విద్యార్థుల సంఖ్య కూడా ప్రధానోపాధ్యాయుడు లక్కు ప్రసాద్, ఉపాధ్యాయుడు నాగేంద్రల కృషితో గణనీయంగా పెరిగింది. నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాల అభివృద్ది చెందుతుందని భావించిన వారికి రెండవ విడతలో కూడా మంజూరు కాకపోవడంతో వారు నిరాశకు గురయ్యారు. ఈ కార్యక్రమంలో తమ పాఠశాల అభివృద్ది చెందుతుందన్న గంపెడాశలతో ఉన్న వారికి తీవ్ర నిరాశ ఎదురైంది. ఇప్పటికైనా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఉన్నతాధికారులు స్పందించి మండల పరిషత్ ఆది ఆంధ్రా ప్రాధమిక పాఠశాలను నాడు నేడుకు ఎంపిక చేయాలని వారంతా కోరుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement