హైదరాబాద్, ఆంధ్రప్రభ : నెల్లూరు రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. స్టేషన్‌కు పశ్చిమాన సబ్‌వే నిర్మాణం 50 శాతం ఇప్పటికే పూర్తి కాగా, 6 లక్షల లీటర్ల సామర్ధ్యంతో గ్రౌండ్ లెవల్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. గ్రాండ్ ట్రంక్ మార్గంలో ఉన్న నెల్లూరు రైల్వే స్టేషన్‌ను ప్రయాణికుల భవిష్యత్తు అవసరాలు తీర్చడానికి ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడానికి ద.మ.రైల్వే పునరాభివృద్ధి పనులు చేపట్టింది.ఈ పనులన్నింటినీ వచ్చే ఏడాది మే నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
పునరాభివృద్ధి పనుల తొలి దశలో భాగంగా సైట్ ఆఫీసులు, కాంక్రీట్ టెస్టింగ్ ల్యాబ్, మెటీరియల్ నిలుపుదల కోసం స్టోరేజీ షెడ్‌ల ఏర్పాటు ఇప్పటికే పూర్తయింది. ఐఐటీ చెన్నై కొత్త స్టేషన్ బిల్డింగ్ డిజైన్ ప్రూఫ్‌ను చెక్ చేసింది. రైల్వే కోర్టు, పోలీసు శాఖ కార్యాలయాల కోసం తాత్కాలిక షెడ్లను నిర్మించి సంబంధిత శాఖలకు అప్పగించారు. కాగా, నెల్లూరు స్టేషన్ కీలకమైన గ్రాండ్ ట్రంక్ రూట్‌లో ఉన్నందున అభివృద్ధి పనులను ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తున్నట్లు ద.మ.రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో స్టేషన్ పునరాభివృద్ధి పూర్తయిన తరువాత కొత్త అనభూతిని కలిగిస్తుందని ఈ సందర్భంగా జైన్ పేర్కొన్నారు