Tuesday, November 19, 2024

జిల్లాలో 18 శాతం వ్యాక్సినేషన్ పూర్తి – ఆక్సిజన్,రెమిడిసివర్ ల కొరత లేదు:కలెక్టర్

రోజుకు 7000 కోవిడ్ నిర్థారణ పరీక్షలు
ఇబ్బంది లేకుండా పడకలు సిద్దం చేస్తున్నాం
ప్రతీ ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలి
జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు

నెల్లూరు కలెక్టరేట్ – నెల్లూరు జిల్లాలో ఇప్పటికే 18 శాతం మంది ప్రజలకు వ్యాక్సిన్ అందించామని, 60 ఏళ్లు దాటిన వారు, 45 ఏళ్లు దాటి హోం ఆర్బిటీస్ ఉన్న వారందరికీ వ్యాక్సిన్ అందించామని కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్.చక్రధర్ బాబు తెలిపారు. నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలోని తిక్కన భవన్ లో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన కలెక్టర్..మాట్లాడుతూ 18 ఏళ్లు దాటిన వారికి కూడా వ్యాక్సిన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.., ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. జిల్లాకు ఈ రోజు 25,000 వ్యాక్సిన్ డోసులు వచ్చాయని, 2 డోసులు వ్యాక్సిన్ వేసుకున్న వారికి కోవిడ్ వలన ఎలాంటి ప్రమాదం లేదని, ప్రతి ఒక్కరూ తప్పక వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. ప్రజలందరూ కోవిడ్ ప్రోటోకాల్, ప్రభుత్వ సూచనలను తప్పక పాటించాలని, యువత మాస్కులు ధరించి, సోషల్ డిస్టెన్స్ పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలన్నారు. కోవిడ్ వ్యాధి నిర్థారణ పరీక్షల ఫలితాలు ఆలస్యం కాకుండా, ప్రతి రోజూ 7000 టెస్టులు నిర్వహించేలా ల్యాబులో ఏర్పాట్లు చేశామన్నారు. గ్రామాల్లో ఫీవర్ క్లినిక్స్, శానిటైజేషన్, కంటైన్ మెంట్ జోన్ ల ఏర్పాటు చేస్తున్నామని.., ఎ.ఎన్.ఎం లు, ఆశా, అంగన్ వాడీ కార్యాకర్తలతో డోర్ టూ డోర్ సర్వే నిర్వహిస్తామన్నారు. నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలోని తిక్కన భవన్ నందు 104, 1077 కంట్రోల్ రూంలు 24 గం. పనిచేస్తూ, ప్రజల నుంచి వచ్చిన కాల్స్ రిసీవ్ చేసుకుని.. క్షేత్రస్థాయి టీంలకు, రాష్ట్ర స్థాయి టీంలకు సమాచారం అందిస్తున్నాయని.., ప్రజలకు కోవిడ్ వ్యాధి నిర్థారణ పరీక్షలు నిర్వహించడం, అవసరమైన వారికి బెడ్స్, వైద్య సహాయం అందిస్తున్నాయన్నారు. ట్రూనాట్ ల్యాబ్స్ కూడా ప్రారంభమయ్యాని, కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్నవారు టెస్టులు చేయించుకుని.., పాజిటివ్ ఫలితం వస్తే దగ్గరలోని పి.హెచ్.సి కి లేదా కోవిడ్ కేర్ సెంటర్ కు వెళ్లాలన్నారు. జి.జి.హెచ్, సి.హెచ్.సి, పి.హెచ్.సి లలో కోవిడ్ చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేశామని, సి.హెచ్.సి, పి.హెచ్.సి లలో స్పెషలిస్టు వైద్యుల చేత ఆక్సిజన్ బెడ్స్, మందులు అందుబాటులో ఉంచామన్నారు. హోం ఐసోలేషన్ సదుపాయం ఉన్నవారికి కిట్స్ అందిస్తున్నామని, మైల్డ్ సింటమ్స్ ఉండి.., సపరేట్ టాయిలెట్, నివాసం ఉండటానికి ప్రత్యేక రూం ఉన్నవారు హోం ఐసోలేషన్ లో ఉండవచ్చన్నారు. జిల్లాలో 9 కోవిడ్ కేర్ సెంటర్లలో సుమారు 3000 బెడ్స్ ఏర్పాటు చేశామని, వైద్య పరీక్షల నిర్వహణకు అవసరమైన పరికరాలు, మందులు, హెమటాలజీ మిషన్స్, ఎక్స్ రే మిషన్స్, ఆక్సిజన్ తో కూడిన బెడ్స్ ఏర్పాటు చేశామన్నారు. దీంతోపాటు కోవిడ్ కేర్ సెంటర్లలో 30 వరకూ కాన్ సన్ ట్రేటర్స్ ఏర్పాటు చేశామని, వీటిద్వారా అవసరమైన వారికి ఆక్సిజన్ అందించవచ్చన్నారు. ప్రతి సి.హెచ్.సి లోనూ ఆక్సిజన్ సిలండర్లు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలో సుమారు 40 నోటిఫైడ్ కోవిడ్ ఆస్పత్రుల్లో 3000 బెడ్స్ కి అనుమతి ఇచ్చామని, క్రిటికల్ కేసులు, 60 ఏళ్లు దాటిన వారు, హోం ఆర్బిటీస్ ఉన్నవారికి ఆస్పత్రుల్లో చికిత్స అందించడానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. కోవిడ్ ఆస్పత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో వైద్యులు, నర్సులు, ఎ.ఎన్.ఎం లు, ఇతర సిబ్బందిని 1000 మంది వరకూ నియమించామని, ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, నిరుద్యోగ యువత ఎవరైనా విధులు నిర్వహించాలని ఆసక్తి ఉంటే నేరుగా నెల్లూరు నగరంలోని జి.జి.హెచ్. ఆస్పత్రిలోనూ, జాయింట్ కలెక్టర్ ( అభివృద్ధి) డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి కార్యాలయంలో సంప్రదించాలని, తగిన అర్హతలు ఉన్నవారికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. జి.ఎం. డి.ఐ.సి, ఎ.డి. డ్రగ్స్, ఈ.ఈ ఎ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి ఆధ్వర్యంలో ఆక్సిజన్ మానటరింగ్ సెల్ ని ఏర్పాటు చేశామన్నారు. ఆక్సిజన్ మానటరింగ్ సెల్ జిల్లాలో నోటిఫైడ్ కోవిడ్ ఆస్పత్రులను సంప్రదిస్తూ ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తుందన్నారు. అడిషనల్ బెడ్స్, ఆక్సిజన్ కొనుగోలు చేస్తున్నామని., కోవిడ్ సర్వీసులలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోందన్నారు. నోటిఫైడ్ కోవిడ్ ఆస్పత్రుల్లో సి.సి కెమెరాలు ఏర్పాటు చేశామని, నోడల్ అధికారులును నియమించామన్నారు. నోడల్ అధికారులు ప్రతి కేస్ షీట్ పరిశీలించి, రోగులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటారన్నారు. రెమిడిసివర్ ఇంజక్షన్ పై ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయని.., నిపుణులైన వైద్యులు, అవసరమైన వారికి మాత్రమే ఈ ఇంజెక్షన్ ఇస్తారన్నారు. దీనిని అక్రమంగా అమ్మడం, వైద్యులు అనుమతి పత్రం లేకుండా కొనుగోలు చేయడం నిషద్ధమన్నారు. జిల్లాలో రెమిడిసివర్ ఇంజక్షన్ కొరతలేదని, ఎప్పటికప్పుడు అవసరమైన రెమిడిసివర్ ను ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నామన్నారు. ఈ ఇంజక్షన్ కిడ్నీ, హృదయ సంబంధ సమస్యలున్నవారు తీసుకోరాదన్నారు. పాజిటివ్ వచ్చిన అందరికీ ఆక్సిజన్, రెమిడెసివర్ ఇంజక్షన్ అవసరం లేదనే విషయాన్ని ప్రజలందరూ గమనించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోయినా.., అనుమతి లేకుండా అమ్మినా, సరఫరా చేసిన, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. సి.టి. స్కాన్ కోసం ప్రజల నుంచి 3000 కన్నా అధికంగా వసూలు చేయరాదన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ కార్డు ద్వారా కోవిడ్ చికిత్స అందించాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే వైద్యం చేయాలని, రోగుల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయరాదన్నారు. కోవిడ్ నివారణలో పాల్గొంటున్న ప్రభుత్వ శాఖల సిబ్బంది, పోలీసులు, న్యాయవ్యవస్థ, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స అందించడానికి ఈరోజు నుంచి ప్రత్యేక బెడ్స్ ను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కోవిడ్ విధుల పర్యవేక్షన బాధ్యతలు జాయింట్ కలెక్టర్ ( అభివృద్ధి) ఆధ్వర్యంలో జరగాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని, దీనిలో భాగంగా జిల్లాలో కోవిడ్ విధుల పర్యవేక్షణ బాధ్యతలు జాయింట్ కలెక్టర్ ( అభివృద్ధి) డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి నిర్వహిస్తారని, ప్రజలకు ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటారన్నారు. జిల్లా వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ అమల్లో ఉందని, ప్రజలు నిబంధనలు పాటించి..ప్రభుత్వానికి, అధికారులకు సహకారం అందించాలన్నారు. ఈ మీడియా సమావేశంలో జాయింట్ కలెక్టర్ ( అభివృద్ధి) డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి, డి.ఎఫ్.ఓ షణ్ముఖ్ కుమార్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement