Monday, November 25, 2024

మాతృభాషతోనే మనుగడ

బుచ్చిరెడ్డిపాలెం ఫిబ్రవరి 21 ప్రభ న్యూస్ మాతృభాషతోనే మానవాళి మనుగడని మండల విద్యాశాఖాధికారి ఎం.దిలీప్ కుమార్ అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని రామచంద్రాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన దిలీప్ కుమార్ మాట్లాడుతూ భాషతోనే చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, అస్తిత్వం ఆధారపడి ఉంటాయనే విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. మాతృభాషలోని మాధుర్యాన్ని భావితరాలకు వారసత్వంగా అందజేసి మాతృభాషాభివృద్ధికి పాటుపడాలన్నారు. “భాష సాంస్కృతిక వైరుధ్యంతోనే గౌరవం” అనే ఇతివృత్తంతో ఈ ఏడాది మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మాతృభాష ఆవశ్యకతను గుర్తించిన యునెస్కో 1999 నుండి ఫిబ్రవరి 21వ తేదీని మాతృభాషా దినోత్సవంగా ప్రకటించిందన్నారు.ఈ సందర్భంగా మాతృభాషకు సేవ చేసిన తెలుగు, తమిళం, కన్నడ సాహితీ మూర్తులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వేమన పద్యాలలోని నీతిని,రీతిని, గిడుగు సవర లిపిని, శ్రీశ్రీ, జాషువా సాహిత్యాన్ని ప్రతి ఒక్కరూ చదవాలన్నారు. భాష మాట్లాడకపోతే, రాయకపోతే, చదవకపోతే అంతరించిపోయే ప్రమాదం ఉందనే విషయాన్ని గమనించాలన్నారు. మాతృభాషలో చదవడం వలన ఆత్మవిశ్వాసం పెరిగి ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు. వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చింతంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జిల్లా రిసోర్స్ గ్రూప్ సభ్యులు గండికోట సుధీర్ కుమార్, ఉపాధ్యాయులు వేణు, బ్రహ్మారెడ్డి, విజయ కుమారి, రసూల్ బేగం, సిఆర్పి మల్లేశ్వర్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement