Tuesday, November 26, 2024

దోమల హోరు .. విషజ్వరాల జోరు..

నెల్లూరు, ప్రభన్యూస్‌ : నెల్లూరు నగరంలోని రోజురోజుకూ దోమల బెడద అధికమవుతోంది. శివారు ప్రాంతాల్లోనే కాకుండా కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని డివిజన్లలో దోమలు అధికంగానే ఉన్నాయి. నగరంలోని కొన్ని డివిజన్లలో పరిస్థితి మరింత భయానకంగా ఉంది. దోమలు పగటిపూట కూడా మనుషులను కుడుతున్నాయి. దీంతో నగరప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా డెంగ్యూ, వైరల్‌, విషజ్వరాలు పెరిగిపోతున్నాయి. కుటుంబంలో ఒకరిద్దరైనా వివిధ రకాల జ్వరాల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారు. కరోనా వైరస్‌ ఒకవైపు వేధిస్తుంటే, విషజ్వరాలు మరోవైపు ప్రజలను బాధిస్తున్నాయి. ప్రజలు ఆసుపత్రుల పాలై అప్పుల పాలవుతున్నారు. దీంతో తమ రోజువారి సంపాదనను కోల్పోవడమే కాకుండా అప్పుల పాలై ఆర్ధికంగా అతలాకుతలమవుతున్నారు. శారీరకంగా బాధలు అనుభవిస్తూనే అనేక వ్యయ ప్రయాసలకోర్చి తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా కార్పొరేషన్‌ అధికారులు, సిబ్బందికి మాత్రం చీమకుట్టినట్లు కూడా లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య నిర్వహణ, పరిశుభ్రతలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని ఊదరగొట్టే అధికారులు, సిబ్బంది వాస్తవ రూపంలో దోమల నియంత్రణకు చేపట్టిన ప్రత్యేక చర్యలు శూన్యమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చెత్తను ఎప్పటికప్పుడు తరలించడం, కాలువల్లో పేరుకుపోయిన మురుగును తొలగించి మురుగునీరు సక్రమంగా ప్రవహించే విధంగా చర్యలు తీసుకున్న దాఖలాలు శూన్యమని ప్రజలు విమర్శిస్తున్నారు. దోమలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఫాగింగ్‌ చేయడం, కాలువల్లో ఆయిల్‌ బాల్స్‌ వేయడం, తదితర చర్యలను సిబ్బంది పూర్తిగా విస్మరించారని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరం నడిబొడ్డు ప్రాంతాల్లోనే పరిస్థితులు ఇలా ఉంటే మురికివాడలు, శివారు ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా, దయనీయంగా ఉందని ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి దోమల నియంత్రణకు అవసరమైన చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని నగర ప్రజలు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement