ముత్తుకూరు, మే 23 (ప్రభ న్యూస్) : భారత ప్రభుత్వం లైఫ్ స్టైల్ ఫర్ ది ఎన్విరాన్మెంట్(పర్యావరణ కోసం జీవనశైలి) ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పారిశ్రామిక ప్రాంతమైన పంటపాలెంలోని కృష్ణపట్నం ఎడిబుల్ ఆయిల్స్ రిఫైనర్ అసోసియేషన్ మంగళవారం చేపట్టింది. ఆయిల్ ఉత్పత్తి కర్మాగారాలను ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా మార్చేందుకు ప్లాస్టిక్ వేస్టేజ్ కలెక్షన్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని చేపట్టింది. స్థానిక సర్పంచ్ ఆలపాక శ్రీనివాసులు కృష్ణపట్నం పోర్ట్ బైపాస్ రోడ్డు మార్గం నందు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయిల్ ఉత్పత్తి కర్మాగారాలైన ఇమామి ఆగ్రో టెక్ లిమిటెడ్, అదాని విల్ మార్ లిమిటెడ్-1, జెమిని ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, సౌత్ ఇండియా, కార్గిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సంతోషిమాత ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, 3యఫ్ ఆయిల్స్ ఎడిబుల్ ప్రైవేట్ లిమిటెడ్, అదాని విల్ మార్ లిమిటెడ్ -2 పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఆయిల్ ఉత్పత్తి కర్మాగారాలకు చెందిన అధికారులు ఎం.వీ.నారాయణమూర్తి, విశాల్, వరప్రసాద్, కళ్యాణ్, చంద్రమౌళి, గణేష్, యోగానంద, మురుగన్, కార్మికులు సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా పర్యావరణ జీవన శైలి కోసం ప్లాస్టిక్ రహితంగా పారిశ్రామిక ప్రాంతాన్ని ఉంచుతామని ప్రతిజ్ఞ చేశారు. అదేవిధంగా రోడ్డు వెంబడి ఇరువైపులా ఉన్న ప్లాస్టిక్ చెత్తను వేరువేసి గోనె సంచుల్లో వేసి పరిశుభ్రం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఇమామి అగ్రోటెక్ లిమిటెడ్ యూనిట్ హెడ్ ఎంవి నారాయణమూర్తి మాట్లాడారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూచనలు ఆదేశాల మేరకు పామాయిల్ పరిశ్రమ యాజమాన్యాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. కృష్ణపట్నం క్లస్టర్ జోన్ పరిధిలో రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మొదటి రోజు బైపాస్ రోడ్డు మార్గంలో నిర్వహించగా రెండో రోజు పంటపాలెం గ్రామంలో నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. పర్యావరణం పరిరక్షణ కోసం భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం కల్పించే విధంగా ప్లాస్టిక్ వేస్టేజ్ కలెక్షన్ ప్రోగ్రాం చేశామన్నారు. పారిశ్రామిక ప్రగతి ఎంత ముఖ్యమో పర్యావరణం కూడా అంతకన్నా ఎక్కువగా చూసుకుంటామన్నారు. తదుపరి సర్పంచ్ ఆలపాక మాట్లాడుతూ.. పంటపాలెం గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆశయాలకు అనుగుణంగా ఆయిల్ ఉత్పత్తి కర్మాగారాలు పర్యావరణం కోసం జీవనశైలి నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు. గ్రామాల ప్రజలకు గోనె సంచులు పంపిణీ చేయాలని సర్పంచి కోరడం జరిగింది. తప్పనిసరిగా అమలు చేస్తామని ఆయిల్ ఉత్పత్తి కర్మాగారాలు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తిన్నెలపూడి బ్రహ్మానందం , వైకాపా ఎంపీటీసీ సభ్యులు రావి విజయ్ కుమార్ రెడ్డి, గ్రామ సచివాలయం డిడిఓ రావుల వెంకటేశ్వర్లు, గ్రామస్తులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.