నెల్లూరు, ప్రభ న్యూస్‌బ్యూరో: మాజీ మంత్రి, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డికి వైసీపీ అధిష్టానం షాక్ మీద షాకులిస్తూ వస్తోంది. ఇటీవల ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గానికి తిరుపతి జిల్లా పార్టీ అధ్యక్షుడు నేదుమల్లి రాం కుమార్ రెడ్డికి సమన్వయకర్తగా పగ్గాలు అప్పగించింది. తాజాగా గురువారం ఆయనకు జీఎస్డబ్ల్యూఎస్ కమిషనర్ నుంచి ఒక సందేశం అందిన ట్లు తెలుస్తోంది. అందులో.. గడపగడపకులో ఇప్పటి వరకూ అందించిన సహకారం
మరువలేనిదని, తమకు ధన్యవాదాలంటూ ఎమ్మెల్యే ఆనంకు సందేశం వచ్చిందని అంటున్నారు. దీని ద్వారా ఇక రానున్న రోజుల్లోనూ గడప గడపకు ఎమ్మెల్యే కార్యక్రమానికి ఆనం హాజరు కావాల్సిన అవసరం లేదనే విధంగా ఈ సందేశం ఉందని ఆనం మద్దతు దారులు బావిస్తున్నారు. గతకొంతకాలంగా ఆనం రామనారాయణ రెడ్డి టీ-డీపీ వైపు చూస్తున్నారని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఆనం గతంలో టీ-డీపీలో పని చేసారు. కాంగ్రెస్‌లో జిల్లాలో కీలక నేతగా వ్యవహరించి సీఎం అభ్యర్ధి వరకూ వెళ్లారు. 2019 ఎన్నికల వేళ వైసీపీలో చేరారు. సొంత నియోజకవర్గం ఆత్మకూరులో మేకపాటి కుటు-ంబం నుంచి ఎమ్మెల్యేగా ఉండటంతో, ఆయనకు వెంకటగిరి కేటాయించారు.
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో నేదురుమల్లి, మేకపాటి కుటు-ంబాలతో ఆనంకు రాజకీయ వైరం చాలా కాలంగా ఉంది. ఈనేపథ్యంలో ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరిలో నేదురమల్లి జోక్యం ఎక్కువగా ఉండటం, స్థానికంగా ఆయనకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ఇటీవల వరుస విమర్శలు చేస్తూ వస్తున్నారు. గత పది రోజుల క్రితం అయితే ఏకంగా సీఎం జగన్‌ను ఉద్దేశించే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త రోడ్లు వేయలేదు, ఉన్న రోడ్లకు గోతులు పూడ్చలేదు..గతంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వలేదు..ఇలా అయితే ప్రజలకు ఏమని సమాధానం చెప్పాలి..పెన్షన్ ఇస్తే ఓట్లు వేస్తారా..ప్రభుత్వాలు పెన్షన్‌లు ఇవ్వలేదా..అంటూ పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆరెండో రోజే అధిష్టానం ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ వెంకటగిరికి రాం కుమార్ రెడ్డిని సమన్వయకర్తగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆయనకు సెక్యూరిటీని కూడా తగ్గిస్తూ మరో షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యే ఆనం రాం నారాయణ రెడ్డికి వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో గడప గడపకు వెళ్లొద్దని ఫోన్ సందేశాన్ని సంబంధిత శాఖ అధికారులకు అందినట్లు తెలుస్తోంది. ఆసందేశాన్ని అధికారులు ఆనంకు పంపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయంపై ఎమ్మెల్యే ఆనం రాం నారాయణ రెడ్డికి ఫోన్‌చేసి వివరణ కోరగా వచ్చిందం టున్నారు..నాకూ తెలియదు..అధికారులను అడిగితే స్పష్టత ఇస్తారని సమాధానమిచ్చారు.