ముత్తుకూరు, డిసెంబర్ 13 (ఆంధ్రప్రభ) : సమీకృత చేపల పెంపకం బహు లాభదాయకమని సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్ (ముంబాయి) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్ జఘీర్ దార్ అన్నారు. శుక్రవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండల కేంద్రం కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ ప్రాంగణంలోని సిల్వర్ జూబ్లీ మినీ ఆడిటోరియంలో సమీకృత చేపల పెంపకంపై (షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక కార్యక్రమం) రైతులకు అవగాహనతో పాటు, క్షేత్రస్థాయి ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్, ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ ఎఫ్, కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్, ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా చేపలు-కోళ్ల పెంపకం, వరి సాగుతో పాటు వివిధ రకాల చేపలు, బాతులు, మొక్కల పెంపకం కార్యక్రమాల గురించి క్షేత్రస్థాయిలో సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్ సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ మురళీధర్, డాక్టర్ షమ్నా, శోభ రావత్, విశ్రాంత అధికారి డాక్టర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా సమీకృత చేపల పెంపకంపై సమగ్రంగా రైతాంగానికి తెలియజేశారు.
తక్కువ ఖర్చు, అధిక దిగుబడి, పర్యావరణ పరిరక్షణ, యాజమాన్య పద్ధతులు, ఉపాధి రంగాలు, తదితర అంశాలపైన సూచనలు, సలహాలు ఇచ్చారు. అదేవిధంగా స్థానిక శాస్త్రవేత్తలు ఆనంద ప్రసాద్, అనుపమ కూడా సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్ డాక్టర్ బాలసుబ్రమణియన్, ప్రొఫెసర్లు మాధవన్, ధనపాల్, తదితరులు పాల్గొన్నారు.